Varalaxmi Tiffin Center Drugs Case: వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డితో అనురాధ ప్రేమాయణం సాగిస్తోంది. అతడి కోసమే డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియుడు కోసం గోవా నుండి డ్రగ్స్ తెప్పిస్తూ.. అక్రమ దందాకు పాల్పడుతోంది. అయితే ఇటీవలే అరెస్ట్ అయిన అనురాధ.. విచారణలో పలువురి పేర్లను వెల్లడించింది. హర్ష వర్ధన్ రెడ్డీ, వీనిత్ రెడ్డి , రవి గోవాలో డ్రగ్స్ నెట్ వర్క్ సూత్రదారులుగా వ్యవహరిస్తున్నారని.. అలాగే నైజీరియన్ కు చెందిన జేమ్స్ పేర్లను అనురాధ వెల్లడించారు.


పది రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని మోకిలలో పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు 52 గ్రాముల కోకైన్, 45 ఎల్‌ఎస్‌డీ పిల్స్, 8 గ్రాముల హెరాయిన్‌ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. మోకిల వద్ద డ్రగ్స్ అమ్ముతుండగా ఎస్‌ఓటీ టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా ఆమెను పట్టుకున్నారు. ఓ అమ్మాయితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు వారి మీద కేసు పెట్టారు. వారి నుంచి 48 గ్రాముల ఎండీఎంఏ, మరొక 8 గ్రాముల క్రషింగ్ ఎండీఎంఏ, 51 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ కీలక వివరాలు వెల్లడించారు. డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ చెలామణికి సంబంధించి సమాచారం రావడంతో డ్రగ్స్ పట్టుకున్నామని అన్నారు. డ్రగ్స్ కేసులో అనురాధ అనే యువతి కీలకంగా ఉందని, ఈమెకు గతంలోనే వివాహం జరిగిందని తెలిపారు. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకుని విడిగా ఉంటోందని అన్నారు. ఆమె తరచూ గోవాకు వెళ్తూ ఉండడం.. గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్‌తో పరిచయం ఏర్పరచుకుందని అన్నారు. గోవాలో జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుక్కొని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు తీసుకువచ్చిందని అన్నారు. ముఖ్యంగా వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డితో ప్రేమాయణం సాగిస్తున్న ఆమె.. అతడి కోసమే ఈ డ్రగ్స్ దందాకు పాల్పడుతోందని అన్నారు. 


గోవాలో జేమ్స్ వద్ద గ్రామ్ పది వేలు చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసిందని, నగరానికి తీసుకువచ్చి డిమాండ్‌ను బట్టి గ్రాము రూ.20 వేలకు పైగా అమ్మిందని తెలిపారు. డ్రగ్స్ అమ్మకంలో వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి ఈమెకు సహకరించినట్లుగా పోలీసులు చెప్పారు. ప్రభాకర్ రెడ్డి డ్రగ్ కన్జ్యూమర్‌గా ఉంటూ పెడ్లర్‌గా మారాడని చెప్పారు. అంతేకాక, ఏపీలోని గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తి కూడా అనూరాధకు డ్రగ్ అమ్మకంలో సహకరించారని వెల్లడించారు. శివ కూడా కన్జ్యూమర్‌గా ఉంటూ పెడ్లర్‌గా మారి అనురాధకు సహకరించినట్లు వెల్లడించారు. ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నామని, వారి మూడు వాహనాలు సీజ్ చేసినట్లుగా చెప్పారు. వారి ఫోన్లు కూడా సీజ్ చేశామని వెల్లడించారు. అందులో వారి కస్టమర్లకు సంబంధించి వివరాలను కూడా ఆరా తీస్తున్నామని చెప్పారు. వీరిని రిమాండ్ చేసి మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని, వారి నెట్ వర్క్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని వివరించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.14 లక్షల వరకు ఉంటుందని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరించారు.