విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని తెలంగాణ సీఎం కేసీఆర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ఓ వైపు అంటూనే మరోవైపు తామే కొంటామంటూ అధికారులను విశాఖకు పంపిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. మంత్రులు కూడా స్టీల్ ప్లాంట్ అంశంపై అనేక ప్రకటనలు చేశారని, ఇంది ఎంత వరకు సమంజసమో కల్వకుంట్ల కుటుంబం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సింగరేణి కార్మికులు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి సమస్యలను పరిష్కరించలేని సీఎం కేసీఆర్.. వైజాగ్ స్లీట్ ప్లాంట్ కొంటామని అధికారులను పంపడం రాజకీయ ఎత్తుగడ అన్నారు.
దేశంలో దళితులను దారుణంగా మోసం చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం కేసీఆర్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దళితులను సీఎం చేస్తానన్నారు. దళితులకు మూడెకరాల స్థలం ఇస్తా అని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ తరువాత దళిత బంధు అని కొత్త డ్రామాకు తీరలేపారని.. అది చివరికి టీఆర్ఎస్ బంద్ గా మారి బీఆర్ఎస్ గా అవతరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇఫ్తార్ విందుకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ కు టైమ్ ఉంటుంది, కానీ భద్రాచలం ఆలయానికి వెళ్లే సమయం తీరిక లేదా అని ప్రశ్నించారు.
ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొనేందుకు కేసీఆర్ కు టైమ్ ఉంటుంది, కానీ ప్రజల సమస్యలు పరష్కరించేందుకు మాత్రం కేసీఆర్ కు టైమ్ ఉండటం లేదని సెటైర్లు వేశారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అందరికీ ఒకే రకమైన హక్కులు, అవకాశాలు కల్పించారని చెప్పారు. సీఎం, ఆయన కుటుంబసభ్యులు అవినీతికి పాల్పడితే దర్యాప్తు సంస్థలు విచారణ జరపకూడదని రాజ్యాంగంలో ఏమైనా ఉందా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. బావిలో కప్పలాగ బతుకుతూ సర్వస్వం తమ కుటుంబానికే తెలుసు అని భావనతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సమాజం త్వరలోనే బీఆర్ఎస్, కేసీఆర్ కు బుద్ధి చెబుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ డెవలప్ మెంట్ పనుల కోసం రాష్ట్ర పర్యటనకు వస్తే సీఎం కేసీఆర్ కు కార్యక్రమానికి వచ్చే తీరిక, సమయం ఎందుకు లేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుందని కాదు, రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఉత్తరాలు రాశానన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీని, ప్రధాని మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకుందన్నారు. యూపీలో జరిగిన గ్యాంగ్ స్టర్ అతీక్, అతడి సోదరుడు అష్రాఫ్ ను కొందరు దుండగులు పోలీసుల కస్టడీలో హత్య చేయడంపై మీడియా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించింది. ఇలాంటి ఘటన జరిగి ఉండకూడదు. కానీ అతడు పెద్ద గ్యాంగ్ స్టర్, కొన్ని వందల కేసులలో అతడు నిందితుడు. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం, నిజాం రాజ్యాంగం రావాలని.. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పక్కనపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆరోపించారు.
భద్రాచలం ఆలయానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలను సీఎం కేసీఆర్ సమర్పించాలి. కానీ సీఎం కేసీఆర్ ఆ పద్ధతికి తిలోదకాలిచ్చారు. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ జయంతి రోజు ఆయన ఎక్కడా వారి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దళితులపై కేసీఆర్ కు ఉన్న ఆలోచన, చిత్తశుద్ధి అలా ఉంటుందన్నారు. కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా 3 ఎకరాల భూమి లేదని, సీఎంను కూడా దళితులను చేయలేదన్నారు.