సీఐఎస్ఎఫ్ జవాన్ల వల్లే నక్సలైట్లు, ఉగ్రవాదులు అదుపులో ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం (మార్చి 12) హైదరాబాద్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్‌ఐఎస్‌ఏ)లో 54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) రైజింగ్ డే పరేడ్‌లో అమిత్ షా పాల్గొన్నారు. ప్రధాని మోదీ దేశం ముందు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నారని అమిత్ షా అన్నారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే మన విమానాశ్రయాలు, ఓడరేవులు, రైలు మార్గాలు, పారిశ్రామిక యూనిట్ల భద్రత చాలా ముఖ్యం అని అన్నారు. రాబోయే కాలంలో CISF అన్ని సవాళ్లను అధిగమిస్తుందని తాను కచ్చితంగా అనుకుంటున్నానని అన్నారు. సీఐఎస్ఎఫ్‌కు ఓడరేవులు, విమానాశ్రయాలు వంటివాటి భద్రత చాలా ముఖ్యమని అమిత్ షా అన్నారు. గత 53 ఏళ్లుగా చేస్తున్నట్టుగానే సీఐఎస్ఎఫ్ వాటికి రక్షణ కల్పిస్తూ ఉందని, వాటి భద్రత కోసం రానున్న కాలంలో అన్ని సాంకేతికతలతో సీఐఎస్‌ఎఫ్‌ను హోం మంత్రిత్వ శాఖ బలోపేతం చేస్తుందని అమిత్ షా చెప్పారు.


అమిత్ షా మాట్లాడుతూ, భారతదేశ అంతర్గత భద్రతకు మూలస్తంభాలలో CISF ఒకటని అన్నారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. భారతదేశ కీలకమైన మౌలిక సదుపాయాలు, చరిత్రాత్మక ప్రదేశాలను సురక్షితం చేయడంలో వారు కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశ భద్రత పట్ల వారికున్న తిరుగులేని నిబద్ధతకు సెల్యూట్ చేస్తున్నాను అని అమిత్ షా అన్నారు.






ప్రధాని మోదీ ట్వీట్


సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. కీలక ప్రదేశాల్లో 24 గంటలపాటు భద్రతను కల్పిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అందరికీ రైజింగ్ డే శుభాకాంక్షలు అని పిఎం మోడీ ట్వీట్‌లో తెలిపారు. మన భద్రతా వ్యవస్థలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వారు కీలకమైన, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన ప్రదేశాలలో రౌండ్ ది క్లాక్ భద్రతను అందిస్తారని అన్నారు. ఈ దళం శ్రమకు, వృత్తిపరమైన దృక్పథానికి ప్రసిద్ధి అని ప్రధాని మోదీ అన్నారు.


CISF మార్చి 10, 1969న పార్లమెంటు చట్టం ప్రకారం స్థాపించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చి 10న CISF రైజింగ్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది CISF వార్షిక రైజింగ్ డే ఫంక్షన్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఢిల్లీ కాకుండా సీఐఎస్‌ఎఫ్ 'రైసింగ్ డే' కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.


మార్చిలో బస్తర్‌లో సీఆర్పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఘజియాబాద్‌లోని ఢిల్లీ శివార్లలో ఉన్న CISF గ్రౌండ్స్‌లో CISF రైజింగ్ డే పరేడ్ జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా, అన్ని పారామిలటరీ బలగాలు ఢిల్లీ వెలుపల తమ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఒకప్పుడు లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం (LWE) ఆధిపత్యం చెలాయించిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మార్చి 19న CRPF వార్షిక రైజింగ్ డేని నిర్వహించనున్నారు.


తెలంగాణ రాజకీయాలపైనా అమిత్ షా చర్చ
అమిత్ షా మార్చి 11 రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సంజయ్  స్వాగతం పలికారు. అక్కడి నుంచి అమిత్ షా  నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ- (NISA)కి వెళ్లారు. అక్కడ  బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తో  అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలు, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ గురించి చర్చించినట్లు తెలుస్తోంది.