Union Budget 2023 Minister of Railways Ashwini Vaishnaw: సికింద్రాబాద్.. తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ. 12వేల 824కోట్లు కేటాయించడం జరిగిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్ నిలయం జీఎం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు జరిగిన మొత్తం కేటాయింపుల గురించి తెలిపారు. కాగా అంశాల వారీగా కేటాయింపుల గురుంచి జీఎం అరుణ్ కుమార్ వివరించారు.
గత ఏడాది కంటే అధిక కేటాయింపులు
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణకు రూ.4 వేల 4 వందల 18 కోట్లు కేటాయింపు జరిగిందని, ఇది గత సంవత్సరం రూ.3048 కోట్లు కంటే 45శాతం ఎక్కువ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ఈ బడ్జెట్ లో రూ.8406 కోట్లు కేటాయించారని చెప్పారు. గత సంవత్సరం చేసిన రూ.7032 కోట్ల కేటాయింపుల కంటే ఈ బడ్జెట్ లో 20 శాతం అధికంగా కేటాయించినట్లు పేర్కొన్నారు. మొత్తం దక్షిణ మధ్య రైల్వేకు 13,786.19కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు.
గత సంవత్సరం కేవలం రూ.8,349.75 కోట్లు కేటాయించారని, దీంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 65 శాతం అధికంగా కేటాయించారని వెల్లడించారు.. ఇందులో డబ్లింగ్, మూడవ లైన్, బైపాస్, లింక్ వర్క్స్ కోసం రూ. 3,374కోట్లు, కొత్త లైన్ లకు, భద్రతకు రూ. 819కోట్లు, విద్యుత్తుకరణ కోసం రూ.588 కోట్ల కేటయింపులు చేసినట్లు వివరించారు.
త్వరలో వందే మెట్రోలు ప్రారంభిస్తాం.. కేంద్ర మంత్రి
ఇటీవల ప్రారంభమైన సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మంచి స్పందన వస్తోందన్నారు కేంద్రం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఇదే క్రమంలో కేంద్రం వందే మెట్రోలు తీసుకురావడానికి ప్లాన్ చేస్తుందన్నారు. వందే భారత్ రైలుకు భిన్నంగా భిన్నంగా ఉండనున్న వందే మెట్రోలు 60 - 70 కి.మీ ఉన్న రెండు పట్టణాల మధ్య నడుస్తుందని చెప్పారు. ట్రయల్ రన్ నిర్వహించి, పరిశీలించిన తరువాతే వందే మెట్రో పట్టాలెక్కుతుందని స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017లో వందే భారత్ రైలు గురించి ప్రస్తావించగా.. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాతే వందే భారత్ రైళ్ల తయారీ దేశీయంగా ప్రారంభించినట్లు వివరించారు. తెలంగాణలో ఎంఎంటీఎస్‌కు రూ.600 కోట్లు కేటాయించామన్నారు. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం టెండర్లు పిలిచామని, త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మరిన్ని వందే భారత్ రైళ్లు పరుగులు పెడతాయన్నారు.
కేంద్ర బడ్జెట్ 2023-24ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు చేశారు. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.