అమృత్‌ సరోవర్‌ రూపంలో తెలంగాణ మోడల్‌ దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైందన్నారు మంత్రి కేటీఆర్. చుక్క నీరు లేక శల్యమైన చెరువులకు ప్రాణం పోసిన నాయకుడు కేసీఆర్ అంటూ ఓ కవితను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పదేళ్ల క్రితం ఎక్కడ చూసిన చెరువుల ఎండిపోయి గుండె బరువెక్కేదన్నారు. ఇప్పుడు వాటిని కల్పతరువుగా మార్చేసి కరువును దూరం చేశారన్నారు. 


ఆయన ఏమన్నారంటే.... పదేళ్ల క్రితం...  
ఏ చెరువును చూసినా గుండెబరువు
వాటిపై ఆధారపడిన కులవృత్తులకు లేదు బతుకుదెరువు
కానీ..
దశాబ్ది ఉత్సవాల వేళ ప్రతి చెరువు... 
కరువును శాశ్వతంగా తీర్చిన కల్పతరువు


చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మలాంటి ఊరి చెరువుకు 
ఊపిరిపోసిన నాయకుడు...


గొలుసుకట్టు చెరువుల గోస తీర్చిన పాలకుడు...
ముఖ్యమంత్రి కేసిఆర్ గారు...


చెరువులకు పట్టిన దశాబ్దాల శిలుమును 
వదిలించిన విప్లవం పేరే.. మిషన్ కాకతీయ


"వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా"  మెచ్చిన పథకమిది
"మిచిగాన్ యూనివర్సిటీ"కి నచ్చిన పథకమిది


గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసిన తరుణమిది
పొలిమేరల్లో ఉన్న చెరువును ప్రతి గుండెకు చేరువ చేసిన చరిత్ర ఇది.


అమృతోత్సవ వేళ మన మిషన్ కాకతీయ 
దేశానికే ఆదర్శమైంది..
“తెలంగాణ మోడల్” “అమృత్‌ సరోవర్‌” రూపంలో 
దేశవ్యాప్తంగా ఆవిష్కృతమైంది. 


మండువేసవిలో మత్తడి దుంకుతున్న చెరువుల సాక్షిగా...
ఈ మహాయజ్ఞంలో మనసుపెట్టి పనిచేసిన ప్రతిఒక్కరికి... 
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చెరువుల పండుగ శుభాకాంక్షలు చెప్పారు కేటీఆర్. 






మరో మంత్రి హరీష్‌రావు కూడా చెరువుల పండుగ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఒకప్పుడు ఎండిపోయిన చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు కళకళలాడుతున్నాయని తెలిపారు. 






ఆయన ఇంకా ఏమన్నారంటే... "నాడు ఎండి పోయిన చెరువులు.. నేడు నిండు కుండల్లా చెరువులు.. నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం.. నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునర్జీవం. అందుకే మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం అయ్యింది. అమృత్ సరోవర్‌గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది"  


దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు చెరువుల పండుగ నిర్వహిస్తున్నారు. మిషన్ కాకతీయలో బాగుపడిన చెరువుల వద్ద సంబరాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేతలు మిషన్ కాకతీయ విజయాలను గుర్తు చేస్తూ ట్వీట్‌లు చేశారు. మరికొందరు ప్రెస్‌మీట్‌లు పెట్టారు.