TSRTC T24 Ticket Price: తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ శుభవార్త చెప్పిన మరుసటి రోజే.. ప్రయాణికులకు షాక్ ఇచ్చింది ఆర్టీసీ యాజమాన్యం. హైదరాబాద్ డే పాస్ టికెట్ ధరను భారీగా పెంచేసింది. ఏకంగా 20 శాతం పెంచింది. ఇప్పటి వరకు డే పాస్ ధర రూ.100 ఉండగా.. ఇక నుంచి డే పాస్ ధరను రూ.120 కు పెంచింది ఆర్టీసీ. అలాగే మహిళలు, సీనియర్ సిటిజెన్స్ కు రూ.80 రూపాయలుగా ఉన్న డే పాస్ ధరను ఇప్పుడు రూ.100 రూపాయలకు పెంచింది. ఒకవైపు ఉద్యోగులపై వరాలజల్లు కురిపిస్తూ.. మరోవైపు ప్రయాణికులకు మాత్రం వాత పెడుతోందని.. సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


డే పాస్ టికెట్లను టీ-24 గా పిలుస్తారు. వీటి ధరలు గతంలో రూ.100 ఉండేది. 100 రూపాయల ఈ టికెట్ తీసుకుంటే 24 గంటల పాటు నగరవ్యాప్తంగా ఎన్ని బస్సులైనా ఎక్కవచ్చు, ఎంత దూరమైన వెళ్లవచ్చు. నగరంలో పర్యాటక ప్రదేశాలను చుట్టి రావాలనుకునే వారికి ఈ టికెట్ చాలా వెసులుబాటు కల్పిస్తుంది. మరే ఇతర ఛార్జీలు లేకుండా కేవలం రూ.100 లతో నగరాన్ని చుట్టి రావొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 20 వేల మంది ఈ టీ-24 టికెట్లను కొనుగోలు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 


టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం


తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరించారు. విలీనానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేలా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. గతంలో 2019లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా.. వారి ప్రధాన డిమాండ్ గా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఉండేది. అయితే, సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేయబోమని కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగులను అరచేతిలో పెట్టుకొని చూసుకుంటామని అప్పట్లో చెప్పారు. కానీ, తాజాగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విలీనం పూర్తి అయితే ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా 43,373 మంది టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను కూడా పరిగణిస్తారు.


కేబినెట్ భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ఆర్టీసీ విలీనం కోసం ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీలో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉంటారు. ఆర్‌ అండ్‌ బీ, రవాణాశాఖ, సాధారణ పరిపాలన (జీఏడీ) శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్‌ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. వీరు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి.. ప్రభుత్వానికి అందజేయాలి. ఆగస్టు 3వ తేదీన ప్రారంభమయ్యే సమావేశంలోనే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభించనున్నాం. అదే రోజు శాసన సభలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడతాం. వెంటనే దానికి సంబంధిన కార్యాచరణ ప్రారంభించాలని కేసీఆర్ శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రికి ఆదేశాలు ఇచ్చారు’’ అని కేటీఆర్‌ తెలిపారు.