- జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో నిర్మాణం చేపట్టవద్దు
- యథాతథ స్థితి కొనసాగించాలని జూబ్లీహిల్స్ సొసైటీకి, చిరంజీవికి హైకోర్టు ఆదేశం
- 595 గజాల స్థలాన్ని చిరంజీవికి అమ్మారన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ
- కౌంటర్లు దాఖలు చేయాలని చిరంజీవికి, సొసైటీకి హైకోర్టు ఆదేశం
- తదుపరి విచారణ ఏప్రిల్ 25కి వాయిదా


జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు తీర్పిచ్చింది. ఈ మేరకు నటుడు చిరంజీవిని హైకోర్టు ఆదేశించింది. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలో నిర్మాణం చేపట్టవద్దని చిరంజీవిని, జూబ్లీహిల్స్ సొసైటీని హైకోర్టు ఆదేశించింది. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని వివాదాస్పద స్థలంపై యథాతథ స్థితి కొనసాగించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.


ప్రజా అవసరాల కోసం వినియోగించేందుకు కేటాయించిన 595 గజాల స్థలాన్ని చిరంజీవికి జూబ్లీహిల్స్ సొసైటీ విక్రయించిందని జె.శ్రీకాంత్‌బాబు, తదితరులు పిటిషన్‌ వేశారు. హైకోర్టులో ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఆ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ గతంలోనే స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని చిరంజీవికి విక్రయించారని పిటిషన్ పేర్కొన్నారు. ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన స్థలాన్ని కొనుగోలు చేసి అందులో చిరంజీవి నిర్మాణం చేపట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ, జీహెచ్‌ఎంసీని ఆదేశించింది హైకోర్టు. పిటిషన్ తదుపరి విచారణ ఏప్రిల్‌ 25కి వాయిదా వేసింది.