TSPSC Papers Leak : పేపర్ లీకేజీ వ్యవహారంపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల నుంచి అధికారిక నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తు్న్న వదంతులను నమ్మొద్దని సూచించారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న ఉద్యోగులు పేపర్ లీక్ చేశారన్నారు. ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కలిసి సిస్టమ్ హ్యాకింగ్ చేసి పేపర్లు లీక్ చేశారన్నారు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదుచేశామన్నారు. ఈ కేసులో విచారణ జరుగుతుందన్నారు. ఏఈ పరీక్ష రద్దుపై రేపు క్లారిటీ ఇస్తామన్నారు. నా పిల్లల కోసం పరీక్ష పత్రాలు లీక్ చేశారని వదంతులు వస్తున్నాయన్న ఆయన... నా పిల్లలు, బంధువులు ఎవరూ పరీక్ష రాయలేదన్నారు. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, మాస్ కాపియింగ్ జరిగే ప్రసక్తే లేదని జనార్థన్ రెడ్డి తెలిపారు.

  


హ్యాక్ చేసి లీక్ చేశారు 


"30 లక్షల మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 26 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. వదంతులను ఆపేందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాను. మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం లేదు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్  ఓవర్సీస్ పేపర్ విషయంలో కొంత సమాచారం వచ్చింది. టీఎస్పీఎస్సీ సంబంధించిన సిస్టమ్ ను హాక్ చేసినట్లు తెలిసింది. నెట్ వర్క్ ఎక్స్ పర్ట్ రాజశేఖర్ రెడ్డికి అన్ని ఐపీ అడ్రస్ లు తెలుసు. ఆయన సిస్టమ్ హ్యాక్ చేశాడు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ తో కలిసి హ్యాకింగ్ చేసినట్లు గుర్తించాం. ప్రవీణ్ పేపర్ ను రూ.10 లక్షలకు అమ్మాడు. దీనిపై సమగ్ర నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటాం. నా పిల్లలకు పేపర్ ఇచ్చారని వదంతులు వచ్చాయి. కానీ నా పిల్లలు గ్రూప్ 1 పరీక్షరాయలేదు. మా బంధువులు రాస్తానంటే నేను వద్దని చెప్పాను. నేను ఈ ఉద్యోగం వదులుకుంటాను మీరు పరీక్ష రాస్తానంటే అని చెప్పాను. నేను తెలంగాణలో పుట్టాను కానీ ఏపీ కేడర్ వచ్చింది. నా పిల్లలు ఇద్దరు నాన్ లోకల్ కేటగిరి కింద వస్తారు. పోలీసుల నివేదిక అందిన తర్వాత పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలపై సోషల్ మీడియా వస్తున్న వార్తలు నమ్మొద్దు." - టీఎస్సీఎస్పీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి  


మాస్ కాపియింగ్ ప్రసక్తే లేదు 


"మాస్ కాపియింగ్ జరిగే ప్రసక్తే లేదు. ఏఈ పరీక్షపై నిర్ణయం తీసుకుందాని మీటింగ్ పెట్టుకున్నాం. కానీ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఏఈ పరీక్షపై రేపు నిర్ణయం తీసుకుంటాం. ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చిన మాట వాస్తవం కానీ అది అత్యధిక మార్కులు కాదు. గ్రూప్ 1 పరీక్షల కోసం చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులకు రాజీనామా చేసి వచ్చారు. ఎంతో మంది పేద విద్యార్థులు ఈ పరీక్ష కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూశారు. పోలీసుల నివేదిక వచ్చిక తర్వాత చర్యలు తీసుకుంటాం. హ్యాకింగ్ పాల్పడిన వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తాం. మొత్తం ఐదుగురి ఉద్యోగాలు పోతాయి. నమ్ముకున్న వాళ్లే గొంతుకోశారు" - జనార్థన్ రెడ్డి