Advocate commission on Minister Srinivas Goud Election Petition: 
హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్ పిటిషన్ పై హైకోర్టు అడ్వకేట్ కమిషన్ ను నియమించింది. సెప్టెంబర్ 11 తేదీ లోపు అడ్వకేట్ కమిషనర్ విచారణ పూర్తి చేయనున్నారు. ఆ సమయంలోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అడ్వకేట్ కమిషనర్ సాక్షుల విచారణ, ఎవిడెన్స్ ను పరిశీలించనున్నారు. సాక్ష్యులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీ కి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 


అడ్వకేట్ కమిషనర్ ముందు హాజరవ్వాల్సిందిగా సాక్షులకు హైకోర్టు ఆదేశించింది. అడ్వకేట్ కమిషనర్ ఈనెల 8న ప్రస్తుత మెదక్ జిల్లా ఆర్డీవో స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఈనెల 11 న నల్గొండ అడిషనల్ కలెక్టర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు అడ్వకేట్ కమిషనర్. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 12 కు వాయిదా వేసింది హైకోర్టు. 


తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. శ్రీనివాస్ గౌడ్ కేసులో తమపైనా కేసుల నమోదుకు కోర్టు ఆదేశించడంతో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగ బద్ద వ్యవస్థలపై ఎలా కేసులకు ఆదేశిస్తారని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసంది. రాజ్యాంగ వ్యవస్థలపై కేసులు నమోదుకు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసి.. జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 


మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదని మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు 2019లో హైకోర్టు‌లో పిటిషన్‌ వేశారు. 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలు పూర్తిగా ప్రకటించలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయిదే రాఘవేంద్రరాజు పిటిషన్‌ను తిరస్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంత్రి అభ్యంతరాలు పరిశీలించాలని ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ పిటిషన్‌ను కొట్టివేసింది.