టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. పార్టీ విధివిధానాల ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి అద్యక్ష పదవి ఎన్నిక ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈక్రమంలోనే ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను 17న విడుదల చేస్తామని ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక అంశంపై మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని పట్టణ, మండల స్థాయి వరకు కమిటీల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామాల్లో గ్రామ కమిటీలు, 3,600 పైగా వార్డు కమిటీలతో పాటు బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల, పట్టణ కమిటీల ఏర్పాటును పూర్తి చేశామని వివరించారు. అనుబంధ సంఘాల నిర్మాణం కూడా పూర్తయిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
‘‘ప్రతి రెండేళ్లకు ఓసారి ఏప్రిల్ 27న పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటాం. కానీ 2019లో పార్లమెంట్ ఎన్నికలు, 2020, 2021లో కరోనా వ్యాప్తి కారణంగా పార్టీ ప్లీనరీ నిర్వహించనేలేదు. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గింది. వ్యాక్సినేషన్ కూడా వేగంగా జరుగుతుంది. నెల రోజుల్లో 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఇలాంటి సేఫ్ పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తున్నాం.’’ అని కేటీఆర్ తెలిపారు.
Also Read: Hyderabad: తల పగలగొట్టుకొని, గాజు పెంకులు నమిలి, బ్లేడుతో కోసుకొని వ్యక్తి నానా బీభత్సం..
అక్టోబర్ 17న పార్టీ ఎన్నికల షెడ్యూల్: కేటీఆర్
హెచ్ఐఐసీ ప్రాంగణంలో అక్టోబర్ 25న పార్టీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటాం. ఆ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన 14 వేల మంది ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 17న షెడ్యూల్ విడుదల అవుతుంది. 22వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 23న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24న నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ డేట్. 25న జనరల్ బాడీ మీటింగ్‌లో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. రిటర్నింగ్ ఆఫీసర్‌గా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తారు. 25న అధ్యక్ష ఎన్నిక ముగిసిన అనంతరం పార్టీ ప్లీనరీ జరుగుతుంది.’’ అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Also Read: Jubilee Hills: భార్య వేలు కట్ చేసి పారిపోయిన భర్త.. వెతుకుతున్న జూబ్లీహిల్స్ పోలీసులు
కేటీఆర్‌ను కలిసిన డీఎంకే ఎంపీలు
తమిళనాడు అధికార పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ ఎంపీలు మంత్రి కేటీటీఆర్‌ను కలిశారు. నీట్ రద్దుకు డిమాండ్ చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను ఈ సందర్భంగా వారు ఆయనకు అందజేశారు. నీట్ రద్దుకు మద్దతు తెలపాలని కోరుతూ స్టాలిన్ ఇటీవల 12 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. కేటీఆర్‌ను కలిసిన వారిలో డీఎంకే ఎంపీలు ఇళంగోవన్, కళానిధి వీరస్వామి తదితరులు ఉన్నారు. ‘విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నీట్ పరీక్ష రద్దు చేయాలని మేము కోరుతున్నాం. మాకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవడం లేదు. కేటీఆర్ సానుకూలంగా స్పందించారు’ అని ఎంపీ ఇళంగోవన్ విలేకరులతో అన్నారు.
Also Read: Hyderabad Theft: ఇంట్లో చోరీ.. వృద్ధురాలి తెలివితో వెంటనే పట్టుబడ్డ దొంగ, ఆ టెక్నిక్ ఏంటంటే..
Also Read: పవన్ కల్యాణ్ విమర్శలకు మోహన్ బాబు ఆన్సర్ ఎప్పుడు? మాటలతోనా? చేతలతోనా ?