అదనపు కట్నం కోసం అతివలపై వేధింపులు ఆగడం లేదు. డబ్బుల కోసం గృహ హింసకు పాల్పడే వారి ఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ సమీపంలో చోటు చేసుకుంది. అయితే, పెద్దలు కుదిర్చిన వివాహం విషయంలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. కానీ, ప్రేమ పెళ్లి చేసుకున్న వీరి విషయంలో కూడా అదనపు కట్నం కోసం వేధించాడు. చివరికి కోపం పట్టలేకపోయిన అతను తన భార్య వేలు కట్ చేసి మరీ పరారయ్యాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అదనపు కట్నం తేవాలని తన భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ముంబయిలో నివసించే హసి అనే 22 ఏళ్ల యువతి, జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరికి చెందిన రవి నాయక్ ఫేస్ బుక్‌లో పరిచయం అయింది. రవి నాయక్ కొద్ది రోజుల క్రితమే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి వెంకటగిరి సమీపంలోనే నివాసం ఉంటున్నాడు.
నగరంలోనే హసి బ్యుటీషియన్‌గా పని చేస్తుండగా.. రవి నాయక్ ఖాళీగా ఉండేవాడు. ఈ నెల 10వ తేదీన తనకు రూ.50 వేలు కావాలంటూ రవి నాయక్ భార్యను అడిగాడు. ఆమె తన వద్ద లేవని తేగేసి చెప్పేయడంతో తీవ్రంగా కొట్టి.. కత్తితో భార్య ఓ వేలిని కట్ చేసి పోయాడు. మరోసటి రోజు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని కూడా బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమె భర్త రవి నాయక్‌పై కేసు నమోదు చేశారు.
Also Read: Khammam: అన్నాదమ్ముళ్ల పాడు పని.. మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు, అంతటితో ఆగకుండా..
సినీ కార్మికుడి ఆత్మహత్య
మరోవైపు, బంజారాహిల్స్‌లో సినీ కార్మికుడిగా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మచిలీపట్నానికి చెందిన తారకేశ్వరరావు అనే వ్యక్తి భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. మద్యానికి బానిసైన ఆయన డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తుండడంతో రోజూ ఇంట్లో గొడవ జరిగేది. ఈనెల 10న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో గదిలోకి వెళ్లిన తారకేశ్వరరావు తలుపు వేసుకొని లుంగీతో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: తెలుగు అకాడమీ స్కామ్ కేసులో రంగంలోకి ఈడీ.. సీసీఎస్ విచారణలో షాకింగ్ విషయాలు!