ప్రసాద్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి... బైక్ తీసుకొని చాలా రోజులైంది. కానీ నెంబర్ ప్లేట్ లేకుండానే తిరుగుతున్నాడు. ఎందుకని అడిగితే... తాను తిరిగేది లోకల్‌లోనే అని... పెద్దగా ఎవరూ పట్టించుకోరని సమాధానం చెప్పేవాడు. ఓ రోజు ఆఫీస్‌కు వెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారు. నెంబర్ ప్లేట్ ఏదని అడిగితే ఏదో కహానీ చెప్పబోయాడు. అయితే పోలీసులు ఆ బైక్‌పై ఉన్న చిట్టా విప్పారు. అప్పటికే చాలా సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినట్టు రికార్డుల్లో ఉందని ఫొటోలతో చూపించారు. అది చూసిన ప్రసాద్ కంగుతిన్నాడు. చివరకు పోలీసులు అతనిపై 420 కేసు పెట్టారు. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.
సుకుమార్ కూడా బైక్‌పై రోజూ ఇరవై కిలోమీటర్లు వెళ్లి వస్తుంటాడు. హెల్మెట్ పెట్టుకోకుండానే తిరుగుతున్నాడు. పోలీసులు ఫైన్ వేయారా అంటే అందుకు ఓ ప్లాన్ చేశాడు. నెంబర్ ప్లేట్‌లోని ఓ నెంబర్‌ను చెరిపేశాడు. ఓ రోజు పోలీసులు పట్టుకొని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయాడు. అప్పటికే ఆ బైక్‌పై 20 వేల వరకు ఫైన్ ఉందని ట్రాఫిక్ పోలీసులు షాకింగ్ విషయం చెప్పారు. ఆ ఫైన్‌తోపాటు 420 కేసు పెడుతున్నట్టు చెప్పారు. అంతే సుకుమార్ ఫ్యూజ్‌లు అవుట్ అయ్యాయి.
ఇది ప్రసాద్, సుకుమార్ విషయంలోనే కాదు... హైదరాబాద్‌లో చాలా మంది చేస్తున్న తప్పు ఇదే. ఇలా చేయడం చాలా పెద్ద నేరమని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వాహనదారుల సెక్యూరిటీ, సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని నెంబర్ ప్లేట్‌ల విషయంలో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. క్రిమినల్ కేసులు బుక్ చేయడంతోపాటు భారీ మొత్తంలో జరిమానాలు కూడా విధిస్తామన్నారు. ఇప్పటికే గత నెలలోనే దాదాపు 100 మందిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు బుక్ అయినట్లు వివరించారు.
నెంబర్ ప్లేటును వంచి నెంబర్ కనపడకుండా..
ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు వింత వింత వేషాలు వేస్తుంటారు. నెంబర్ ప్లేటులో ఓ నంబర్ కనిపించకుండా ఏదైనా అడ్డుగా పెడుతుంటారు. నెంబర్ పేట్లును వంచేస్తుంటారు. ఏదో ఒక నెంబర్ కనిపించకుండా పెయింట్ తొలగించడమో... వైట్ పెయింట్ పూయడమో చేస్తుంటారు. ఇలాంటి చర్యల వల్ల ఫొటో తీసిన తర్వాత నెంబర్ సరిగ్గా కనిపించదని... జరిమానా నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటారు. ఒక వేళ దొరికినా నెంబర్ ప్లేట్లు ఓ వైపు వంచేసిన వాళ్లు రోడ్డు ప్రమాదం జరిగే ఇలా వంగిపోయిందంటూ సాకులు కూడా చెప్తారు. వారు చెప్పింది చూస్తే నిజమనే అనిపిస్తుంది. కానీ ఇదంతా ట్రాఫిక్ ఛలాన్లు తప్పించుకోవడం కోసమే. రోడ్డుపై వెళ్తుంటే చాలా వాహనాల్లో ఈ విషయాన్ని గుర్తించవచ్చు.
నెంబర్ ప్లేటు లేని, ట్యాంపర్డ్ ప్లేటు వాహనాలు..
తరచుగా ఇలాంటివే వెలుగు చూడటంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. అలా నెంబర్ ప్లేటు కనిపించకుండా చేసే వారితోపాటు నెంబర్ ప్లేటు లేని వాహనాల్లో తిరిగే వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. చాలా రిపీటెడ్ వార్నింగ్స్ తర్వాత క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నారు. క్రిమినల్స్ సాధారణంగా ట్యాంపర్డ్ ప్లేట్ లేదా ఎటువంటి నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై తిరుగుతుంటారు. ఇది సీరియస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని వార్నింగ్ ఇస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 420తోపాటుగా మోటర్ వెహికల్ యాక్ట్ మోసాలకు పాల్పడే వారిపై కూడా కేసులు విధించనున్నారు.
నెంబర్ ప్లేట్ మోసాలపై కఠిన చర్యలు
చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ పెనాల్టీల నుంచి తప్పించుకోవాలనే ఇలా చేస్తున్నారని... ఇదంతా ప్రభుత్వాన్ని, ట్రాఫిక్ పోలీసులను మోసం చేయడమే అంటూ తేల్చారు. అందుకే వారిపై క్రిమినల్ కేస్ బుక్ చేసి.. వాహనం సీజ్ చేస్తున్నామని వివరించారు. ఇలా ట్యాంపర్డ్ ప్లేట్‌లతో ఉన్న వాహనాలను గుర్తించిన లోకల్ ట్రాఫిక్ పోలీసులు దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇస్తారు. వాహన అనుమతి రద్దు చేస్తారు. వాహన యజమాని లేదా వాహనాన్ని నడిపే వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు. వారిపై క్రిమినల్ కేసు బుక్ చేస్తారు.
వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకపోయినా ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తెలిసినా లా అండ్ ఆర్డర్ పోలీసులు సైతం కేసులు బుక్ చేస్తున్నారు. కోర్టు తీర్పుల మేరకు జరిమానాలు విధిస్తున్నారు. శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఎవరూ చూడటం లేదన్న భ్రమలో వాహనదారులు తప్పులు చేయొద్దని... హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న కెమెరాల్లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెబుతున్నారు.