కలిసొస్తోంది.. అంతా మనకి అనుకూలంగా ఉంటోంది అనుకుంటున్న సమయంలో అధిష్టానం తీసుకుంటోన్న నిర్ణయాలు ఆ పార్టీ నేతలకు కష్టంగా మారుతోంది. ఇప్పుడిప్పుడే ప్రజల్లో.. అన్ని సామాజిక వర్గాల్లో పార్టీకి ఆదరణ, బలం పెరుగుతోందని సంబరపడుతున్న సమయంలో పార్టీ పెద్దలు ఇచ్చిన షాక్ తో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అవును. ఆ పార్టీ బీజేపీనే. ఆ నేతల వివరాలు, పరిస్థితి ఇలా ఉంది.
దక్షిణాదిన పుంజుకునే ప్రయత్నాలు.. కానీ !
దక్షిణాదిన బీజేపీకి అంత పట్టులేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మొన్నటివరకు కాషాయానికి అసలు బలమే లేదు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కమలం పార్టీ పుంజుకుంటోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు (GHMC Elections) ఇచ్చిన ఉత్సాహంతో పాటు బైపోల్స్ లో గెలుపు.. రానున్న ఎన్నికల్లో బీజేపీని బలమైన పార్టీగా తెలంగాణలో నిలబెడుతాయని ఆపార్టీ రాష్ట్ర నేతలు ధీమాతో ఉన్నారు. దీనికి తోడు ఇటీవల బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలు కూడా హైదరాబాద్ వేదికగా జరగడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అధిష్టానమంతా తెలంగాణలో పార్టీ బలోపేతానికి అండగా ఉంటామని రాష్ట్ర నేతలకు హామీ ఇచ్చారు. ఇంకేముంది ఇదే జోష్ ని కొనసాగిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తోపాటు పలువురు నేతలు పాదయాత్రలు, బైక్ ర్యాలీలతో తెలంగాణలో కొనసాగిస్తున్నారు. ఈ స్పీడుకి బ్రేక్ వేసినట్టు ఇప్పుడు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల నిరసనకు దిగారు.
విద్యుత్ సవరణ బిల్లుతో భగ్గుమంటున్న ఉద్యోగులు
విద్యుత్ సవరణ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు నిరసనకు దిగారు. తెలంగాణలో అయితే ఈ నిరసన తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా.. బీజేపీ పార్టీ అంటేనే రగిలిపోతున్నారు విద్యుత్ ఉద్యోగులు. ఈ బిల్లుని కేంద్రం వెనక్కి తీసుకోకపోతే ఉద్యోగుల దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు బీజేపీ నేతలు, మంత్రులు, చివరకు పార్టీ కార్యకర్తలకు సైతం విద్యుత్ ఉద్యోగుల షాక్ ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు.
నిన్నగాక మొన్న తెలంగాణ రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ధాన్యం కోనుగోలు విషయంలో కేంద్రం తప్పిదాలే కారణమని సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేయడంతో రైతన్నలు బీజేపీ నేతల ఇళ్లని ముట్టడించారు. ఆపార్టీ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలదీశారు.
జేఏసీ మహా ధర్నా
బీజేపీకి వ్యతిరేకంగా విద్యుత్ జేఏసీ నిర్వహించిన "మహా ధర్నా" లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... " సామాన్య ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమైన విద్యుత్ సవరణ బిల్లు, కేవలం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అనుకూలమైన బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను సంప్రదించకుండా ఏకపక్షంగా విద్యుత్ సవరణ బిల్లు - 2022ను పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, అయితే విపక్ష పార్టీల నిరసనలతో తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం చివరికి పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేసిందని ఆయన అన్నారు. తాము విద్యుత్ జేఏసీ పోరాటానికి టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.
ఇతర రాజకీయ పార్టీలతో పోటీ పడటం వేరు, ఉద్యోగులతో పెట్టుకోవడం వేరు. అందులోనూ విద్యుత్ ఉద్యోగులతో పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. గతంలో చంద్రబాబు నాయుడు ఇలానే ఉద్యోగులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా తరువాత ఎన్నికలలో ఓటమి చూశారు. తెలంగాణ సాధనలో విద్యుత్ ఉద్యోగులపోరాటం అందరికి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీ కూడా ఉద్యోగుల నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే బలహీనం కాదు కదా భారీగానే నష్టపోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.
సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టాలని భావిస్తోన్న బీజేపీ ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుందో అర్థం కావడం లేదంటున్నారు. అంతేకాదు కొంతకాలం నుంచి ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని గుర్తు చేస్తున్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను ఎలా వెనక్కి తీసుకునేలా నిరసనలు తెలిపారో అలాగే విద్యుత్ సవరణ బిల్లుల చట్టాలపై కూడా కేంద్రం నిర్ణయాన్ని మార్చుకోకపోతే పంజాబ్ లో జరిగినట్లే తెలంగాణలో కూడా అంతేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.