తెలంగాణలో రైతులకి ఉచిత విద్యుత్ వ్యతిరేకించినట్లుగా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. దీన్ని బీఆర్ఎస్ నేతలు బాగా ప్రజల్లోకి తీసుకెళ్లి తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నారు. అయితే, తన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చిన రేవంత్ రెడ్డి నేడు (జూలై 13) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలాగా పుట్టలో పడుకున్న పాములు బయటకి వచ్చి తనను నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అమెరికాలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొందరు నిపుణులు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై ప్రశ్నలు వేశారని, కాంగ్రెస్ పార్టీ విధివిధానాలను తాను స్పష్టంగా వారికి వివరించినట్లుగా చెప్పారు. తాను చెప్పిన సమాధానంలో కొంత భాగాన్ని కట్ చేసి ప్రచారం చేశారని ఆరోపించారు. 


రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అతి తెలివి ప్రదర్శించి చిల్లర వ్యవహారం చేశారంటూ మండిపడ్డారు. ఉచితంగా ఇస్తున్న విద్యుత్‌పై మరోసారి చర్చ జరగడం మంచిదే అని అభిప్రాయపడ్డారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని కాంగ్రెస్ అప్పట్లోనే ప్రకటించిందని.. ఫ్రీ విద్యుత్తు ఇవ్వడం కుదరదని అప్పట్లో టీడీపీతో చెప్పించిన వ్యక్తి చంద్రశేఖర్ రావు అంటూ గుర్తు చేశారు. అప్పట్లో విద్యుత్ కోసం చేసిన పోరాటంలో రైతులను చంపిన పాపం ముమ్మాటికీ కేసీఆర్ కి తగులుతుందని రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ ముందుకు కనుక వస్తే వ్యవసాయంలో ఇద్దరం కలిసి పోటీ చేస్తామని అన్నారు. ‘‘తాను వ్యవసాయం తెలిసిన వాడినని.. దుక్కి దున్నిన వాడినని అన్నారు. కేటీఆర్ అమెరికాలో బాత్‌రూంలు కడిగారని, ఆ పనులు తాను చేయలేదని అన్నారు. తాను పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకుని కూడా కాదని అన్నారు.


రూ.8 వేల కోట్ల అవినీతి - రేవంత్ రెడ్డి


రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ.16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నిజానికి చిన్న, సన్నకారు రైతులకు ప్రస్తుతం ఎనిమిది గంటల మాత్రమే కరెంట్ ఇస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల ఫాంహౌస్ లు, భూములు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా 12 గంటలకు మించి ఉచిత విద్యుత్ సరఫరా కావడం లేదని అన్నారు. అలాంటప్పుడు 16 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్ పేరుతో ఆ బడ్జెట్ లోని నిధుల్లో సగం డబ్బును దాదాపు ఏడాదికి 8 వేల కోట్లు రూపాయలు వెనక వేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.


రేవంత్ వ్యాఖ్యలు ఇవీ


తెలంగాణలో ఉన్న 95 శాతం మంది రైతులు 3 ఎకరాలలోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులే అన్నారు. ఒక ఎకరానికి నీరు పారించాలంటే ఓ గంట చాలని.. మూడు ఎకరాలకు ఫుల్‌గా నీళ్లు పారించాలంటే మూడు గంటలు చాలని అభిప్రాయపడ్డారు. టోటల్‌గా 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని వివరించారు. కేవలం విద్యుత్ సంస్థల వద్ద కమీషన్లు తీసుకునేందు వ్యవసాయానికి 24 గంటలక కరెంటు స్లోగన్స్ తీసుకొచ్చారని ఆరోపించారు.