సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ఓ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఆయన హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ కు వచ్చారు. అక్కడి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు నేడు (జూలై 13) తన అనుచరులతో కలిసి మోహన్ బాబు వచ్చారు. అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజీ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లారు. మీడియా ప్రతినిధుల కెమెరాలను చూడగానే మోహన్ బాబు చిందులు తొక్కారు.
ఆ లోగోలు లాక్కొండయ్యా అంటూ తన బౌన్సర్లకు సూచించారు. మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా? అంటూ తన నోటికి పని చెప్పారు. సీనియర్ నటుడైన మోహన్ బాబు తాను కొనుగోలు చేసిన ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వచ్చినట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారం మీడియా దృష్టి పడకుండా ఆయన వ్యవహరించడంతో అక్కడ ఉన్నవారు ఏం జరుగుతుందోనని చూస్తూ ఉండిపోయారు. మీడియాపై చిందులు తొక్కిన వ్యవహారం, బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించిన తీరు రాద్ధాంతం అయింది.