Telangana News: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రులకు సంబంధించి వారంతా ఇకపై వారానికి 2 రోజులు గాంధీ భవన్‌కు రావాలని నిర్దేశించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను, మంత్రులు రావాల్సిన షెడ్యూల్‌ను కూడా ఖరారు చేస్తూ ప్లాన్ రూపొందించాలని గాంధీ భవన్ సిబ్బందికి మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ నిర్ణయం వెల్లడించారు. ప్రతి బుధ, శుక్రవారాలలో ఒక్కో మంత్రి గాంధీ భవన్‌కు రావాలని మహేష్ సూచించారు. వచ్చే శుక్రవారం నుంచి గాంధీ భవన్‌కు మంత్రుల రాక ప్రారంభం అవుతుందని అంటున్నారు.
అయితే, బాధ్యతల స్వీకరణ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తాను పీసీసీ అధ్యక్షుడిని అయినా కూడా సామాన్య కార్యకర్త తరహాలోనే ఉంటాననని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఇద్దరు విభిన్నమైన వ్యక్తులతో కలిసి పని చేశానని గుర్తు చేసుకున్నారు. వారిలో ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకరు రేవంత్ రెడ్డి అని అన్నారు.
తనకు గాంధీ భవన్‌తో 40 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. తాను పీసీపీ చీఫ్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదని.. అలాగే తనకు ఇన్నీ రోజులు పదవి ఎందుకు రాలేదని ఎప్పుడు అనుకోలేదని అన్నారు. తన పని తాను చేసుకుంటూ వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ పదవి కూడా అందుకే తనకు వచ్చిందని చెప్పారు. ‘‘గాంధీ భవన్‌లో ఎలాంటి పవర్ సెంటర్లు లేవు. ఒక్కటే సెంటర్ పవర్ రాహుల్ గాంధీ. ప్రతి రోజు నేను గాంధీ భవన్‌లో 6 గంటలు ఉంటాను. ప్రతి వారం ఒక ఇద్దరు మంత్రులు గాంధీ భవన్‌కు రావాల్సి ఉంటుంది. బుధవారం ఒకరు.. శుక్రవారం మరో మంత్రి అందుబాటులో ఉండాలి. నెలకు ఒకసారి సీఎం కూడా గాంధీ భవన్‌కు రావాల్సి ఉంటుంది’’ అని మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు.
మహేశ్ గౌడ్ బాధ్యతలు స్వీకరించే ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దీపాదాస్ మున్షీతో పాటుగా ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు.
అనంతరం వరంగల్ పర్యటనకు
ఈ కార్యక్రమం అనంతరం మొట్టమొదటిసారి వరంగల్ జిల్లా పర్యటనకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు. ఆయనకు ఓరుగల్లు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ జిల్లా నాయకులతో కలిసి భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి వెళ్లి పూజలు నిర్వహించారు.