BRS MLA Maganti Gopinath | అమరావతి: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) సంతాపం తెలిపారు. జూన్ 5న తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్ అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన చంద్రబాబు.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీ (TDP)తో ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HUDA) అధ్యక్షుడిగా పని చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపినాథ్ 2014లో తొలిసారి టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా విజయం సాధించగా.. 3 సార్లు వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన గోపీనాథ్ పలు పదవులను సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు.
మాగంటి మృతి బాధాకరం.. ఏపీ మంత్రి నారా లోకేష్
హైదరాబాద్ జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఏపీ మంత్రి నారా లోకేష్ దిగ్ర్భాంతికి లోనయ్యారు. ‘గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరం. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు.
2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం కృషి చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలిపారు’ ఏపీ మంత్రి నారా లోకేష్. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.