ఒమిక్రాన్ వైరస్ కలవరం ఇప్పుడు తెలంగాణలో మొదలైంది. హైదరాబాద్‌లో ఏకంగా మూడు ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్లుగా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇద్దరు విదేశీ ప్రయాణికులకు ఒమిక్రాన్ ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. మరో బాలుడికి గుర్తించగా.. అతను కోల్ కతా వెళ్లిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు హైదరాబాద్‌లో రెండు ఉన్నాయని, వీరిలో ఒకరిని గుర్తించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లుగా వివరించారు. కోఠిలోని ప్రజారోగ్యశాఖ కార్యాలయంలో శ్రీనివాసరావు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో గుర్తించిన ఒమిక్రాన్ కేసుల వివరాలను ఆయన ప్రకటించారు.
24 ఏళ్ల కెన్యా యువతికి..
‘‘నెలరోజుల్లోనే ఒమిక్రాన్ 70 కి పైగా దేశాలకు విస్తరించింది. మన దేశంలో పదుల సంఖ్యలో రిపోర్ట్ అవుతున్నాయి. కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఏపీలో ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. తెలంగాణలో మొదటిసారిగా రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించాం. ఇద్దరు విదేశీ ప్రయాణికులను ఎయిర్ పోర్టులో గుర్తించగా.. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలో ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. 24 ఏళ్ల కెన్యా యువతి ఈ నెల 12వ తేదీన వచ్చింది. ఆమెకు పాజిటివ్ రాగా.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాం. నిన్న సాయంత్రమే ఇది ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఆమెను వెంటనే గుర్తించి గచ్చిబౌలిలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఇద్దరు కుటుంబ సభ్యులను కూడా ఐసోలేట్ చేశాం.
23 ఏళ్ల సోమాలియా యువకుడికి..
ఈనెల 12న శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన 23 ఏళ్ల సోమాలియా వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ఇతడి ఆచూకీ గుర్తిస్తున్నాం. వెంటనే వారి కుటుంబ సభ్యులను కూడా ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తాం.
మూడో వ్యక్తి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఏడు సంవత్సరాల బాలుడు. ఇతని ఫ్యామిలీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగిన తర్వాత అధికారులు శాంపిల్స్ తీసుకున్నారు. వెంటనే వారు డొమెస్టిక్ ఫ్లైట్‌లో కోల్ కతా వెళ్లిపోయారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ ఆరోగ్యశాఖకు తెలియజేశాం.’’ అని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
తక్కువ టైంలోనే డబుల్ కేసులు.. వేగంగా వ్యాప్తి
‘‘రోజువారీ నమోదవుతున్న కరోనా కేసులు సాధారణమైనవే. హైదరాబాదీలకు, తెలంగాణ వాసులకు ఒమిక్రాన్ సోకినట్లుగా ఎక్కడా గుర్తించలేదు. కాబట్టి, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. యూకేలో ప్రస్తుత డేటా ప్రకారం 2.7 రోజుల్లోనే కేసులు డబుల్ అయ్యాయి. కొన్ని యురోపియన్ దేశాల్లో కూడా రోజున్నరలోనే ఒమిక్రాన్ కేసులు డబుల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్. కానీ, వైరస్ సోకితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఈ వైరస్ తీరుకు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది. పెద్దవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్న పిల్లలకు ఈ వైరస్ సోకితే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి కూడా సాధారణ కొవిడ్ సోకుతున్న దాఖలాలు ఉన్నాయి. కాబట్టి, ఈ వైరస్ నుంచి దూరంగా ఉండాలంటే ప్రజలు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాల్సిందే. మాస్కే మన ఆయుధం. కాబట్టి అందరూ మాస్కు ధరించాల్సిందే.’’ అని శ్రీనివాసరావు సూచించారు.
Also Read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు
Also Read: చాక్లెట్ ఇస్తానని మతిస్తిమితం లేని యువతిపై వృద్ధుడి లైంగిక దాడి.. మరో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం