TGSRTC MD VC Sajjanar : తెలంగాణ ఆర్టీసీ రక్షా బంధన్‌ రోజున మెరుగైన సేవలను అందించి కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఒకవైపు భారీ వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నా.. క్షేమంగా కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేర్చి రక్షా బంధన్‌ వేడుకలను ఆనందోత్సాహాల మ ధ్య నిర్వహించుకునేలా చేసిన ఆర్టీసీ సిబ్బందికి ఉన్నతాధికారులు నుంచి ప్రశంసలు అందాయి. రాఖీ ఆపరేషన్స్‌, మెరుగైన పనితీరుపై తమ క్షేత్రస్థాయి అధికారులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవానా సంస్థ(టీజీఎస్‌ఆర్‌టీసీ) యాజమాన్యం ప్రత్యేకంగా సమావేశమైంది. హైదరాబాద్‌ బస్‌ భవన్‌ నుంచి వర్చువల్‌గా బుధవారం జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఖీ పండగ ఆపరేషన్స్‌లో సిబ్బంది పనితీరు, అనుభవాలతోపాటు భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలను గురించి చర్చించారు. క్షేత్రస్థాయి అధికారులు నుంచి సలహాలు, సూచనలను ఈ సందర్భంగా స్వీకరించారు. 


అద్భుతంగా పని చేశారంటూ ఎండీ ప్రశంసలు


ఈ సందర్భంగా మాట్లాడిన టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ రాఖీ పండగా సందర్భంగా సంస్థలోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా పని చేశారని కొనియాడారు. భారీ వర్షాల్లోనూ నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పని చేశారని ప్రశంసించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో రికార్డు స్థాయిలో 1.74 కోట్ల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు సంస్థ చేరవేసిందని వెల్లడించారు. వరుసగా మూడు రోజులు సంస్థల్లో 100 శాతానికిపైగా ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) నమోదైందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాఖీ పండగ రోజే 63 లక్షల మంది తమ బస్సుల్లో రాకపోకలు సాగించారని గుర్తు చేశారు. మూడు రోజుల్లో 1.07 కోట్ల కిలో మీటర్లు మేర ఆర్టీసీ బస్సులు తిరిగాయని సజ్జనార్‌ వివరించారు. గతేడాది రాఖీ పౌర్ణమి రోజున 21 డిపోలు 100 శాతానికిపైగా ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) నమోదు చేయగా, ఈ ఏడాది మాత్రం 97 డిపోలు ఆ మైలురాయిని దాటిందని వివరించారు. ఈ రాఖీ పండగ టీజీఎస్‌ఆర్‌టీసీ రికార్డులన్నింటినీ తిరగరాసిందని ఈ సందర్భంగా సజ్జనార్‌ పేర్కొన్నారు. 


అత్యధిక ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) నమోదు చేసిన మహబూబ్‌నగర్‌, నల్లగొండ, మెదక్‌, వరంగల్‌, కరీంనగర్‌ రీజియన్ల ఆర్‌ఎంవోలను ప్రత్యేకంగా అభినందించారు. గజ్వేల్‌ - ప్రజ్ఞాపూర్‌, హుజురాబాద్‌, దుబ్బాక, కల్వకుర్తి, ముషీరాబాద్‌, దేవరకొండ, తొర్రూర్‌, నార్కెట్‌పల్లి, షాద్‌నగర్‌ డిపోలు అత్యధిక ఓఆర్‌ను నమోదు చేశాయని, ఆయా డీఎంలకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. రాఖీ పౌర్ణమి రోజున విధుల్లో నిర్వర్తించిన సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్న సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ను అధికారులు అభినందించారు. భోజనం అదించడం వల్ల ఎలాంటి ఆలస్యం లేకుండా ఆపరేషన్స్‌ సజావుగా జరిగాయని, కొందరు డ్రైవర్లు బస్సు స్టీరింగ్‌పై కూర్చుని భోజనం చేసి వృత్తి పట్ల నిబంధతను చాటుకున్నారని యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు, సిబ్బంది పనితనాన్ని యాజమాన్యం గుర్తిస్తుందని, రాఖీ పౌర్ణమి ఆపరేషన్స్‌లో మెరుగైన పనితీరును కనబరిచిన వారికి త్వరలోనే రివార్డులను అందిస్తుందన్నారు. టీజీఎస్‌ఆర్‌టీసీ ఆదరిస్తూ వెనుదన్నుగా నిలుస్తోన్న ప్రయాణీకులందరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీవోవో డాక్టర్‌ రవి చందర్‌, జేడీ అపూర్వారావు, ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ మునిశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.