Union Minister Bandi Sanjay Hot Comments On Cm Revanth And Harish Rao : బీజేపీ పార్టీలో చేరికలపై తెలంగాణ బీజేపీలో కీలక నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరేందుకు ఎవరొచ్చినా తాము ఆహ్వానిస్తామన్న ఆయన.. సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు సహా ఎవరు పార్టీలో చేరుతామన్నా అక్కున చేర్చుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. హరీష్‌ రావు పార్టీ మారుతారంటూ కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ దశలో హరీష్‌రావుతోపాటు సీఎం రేవంత్‌ రెడ్డి పేరును కూడా మంత్రి సంజయ్‌ ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


కేటీఆర్‌ ఒక్కడే అమాయకుడిలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేటీఆర్‌ది కాకుండా గతంలో రేవంత్‌ రెడ్డిపై ఎందుకు నమోదు చేశారో చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ఆ సమయంలో ఫామ్‌ హౌస్‌ సొంతమా..? ఇప్పుడు లీజుకు తీసుకున్నారా..? అని నిలదీశారు. అక్రమంగా నిర్మించిన ఫామ్‌ హౌస్‌లు కూల్చివేతలను తాను సమర్థిస్తున్నట్టు స్పష్టం చేశారు. గజాల్లో కట్టిన ఇళ్లను హైడ్రా (హైదరాబాద్‌ డిజిస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అధికారులు కూల్చివేస్తున్నారన్న బండి సంజయ్‌.. భారీ భవన నిర్మాణాలు సాగించిన యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన హైడ్రా కలెక్షన్ల కోసమేనని బండి సంజయ్‌ ఆరోపించారు. 


ఎన్నికలకు డబ్బులు పంపాలన్న అధిష్టానం


సీఎం రేవంత్‌ రెడ్డిపైనా బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. మహరాష్ట్ర, హర్యాన ఎన్నికల కోసం డబ్బులు పంపించాలని సీఎం రఏవంత్‌ రెడ్డికి హైకమాండ్‌ లక్ష్యాన్ని విధించిందంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే హైడ్రా ఆవిర్భవించిందంటూ ఆయన పేర్కొన్నారు. అధిష్టానం ఆదేశాలతో రేవంత్‌ రెడ్డి ఇబ్బందుల్లో పడ్డారన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎందుకు దూరంగా ఉందని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్‌ పార్టీకి లాభం చేసేందుకు కాదా..? అని మంత్రి ప్రశ్నించారు. లిక్కర్‌ కేసులో అరెస్టు అయిన కవిత బెయిల్‌ కోసం అభిషేక్‌ మను సంఘ్వి తీవ్రంగా కృషి చేశారన్న మంత్రి బండి సంజయ్‌.. ఆయన రుణం తీర్చుకునేందవుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ కలిసి రాజ్యసభకు పంపిస్తున్నాయన్నారు.


తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్‌ చెప్పినట్టే నడుస్తోందని ఆరోపించారు. మరికొన్ని రోజుల్లో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కావడం ఖాయమన్న సంజయ్‌.. ఈ మేరకు ఇరు పార్టీలు మధ్య లోపయికారీ ఒప్పందం నడుస్తోందని ఆరోపించారు. అందుకోసమే విగ్రహాల గొడవను తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు గురించి ఎక్కడ ప్రశ్నిస్తామన్న ఉద్ధేశంతోనే రేవంత్‌ రెడ్డి ముందుగా విగ్రహాలు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. సచివాలయం ముందు మాజీ ప్రధాని వాజపేయి విగ్రహం నెలకొల్పాలని తమకు ఉందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం మంచిదని, ఆ దిశగా దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు. విగ్రహాల అంశాన్ని పక్కనపెట్టి, పరిపాలనపై దృష్టి సారించాలని సూచించారు.