TGSRTC MD Sajjanar responds over video of dangerous bus stunt | హైదరాబాద్: క్రేజ్ కోసం, ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలని కొందరు యువత పిచ్చి పనులు చేస్తున్నారు. ఆ పిచ్చి ఎలా ఉంటుందంటే, రీల్స్ చేయడానికి ప్రయత్నించి చెరువులో పడి చనిపోతున్నారు కొందరు. కాలువల్లో పడి కొట్టుకుపోతున్నారు మరికొందరు. కొందరైతే అవతలి వ్యక్తుల ప్రాణాల మీదకి తేవడంతో పాటు కొన్నిసార్లు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కొందరైతే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఓ యువకుడు నడుస్తున్న బస్సు ముందు అకస్మాత్తుగా పడుకున్నాడు. బస్సు వెళ్లిపోయాక ఎంచక్కా లేచి పక్కకు వెళ్లిపోయారు.
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ రోడ్డు మీద రీల్‌ను చిత్రీకరించే ప్రయత్నంలో ఓ యువకుడు నడుస్తున్న బస్సు ముందు అకస్మాత్తుగా పడుకున్నాడు. అలాంటి ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ తన ప్రాణాలను పణంగా పెట్టే ప్రయత్నం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీల్స్ పిచ్చిలో యువకుడు ప్రమాదకరమైన స్టంట్ చేసిన వీడియోపై నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు వాడు పైకి పోయింటే బాగుండేదని చెబుతుంటే, అతన్ని వెంటనే "అరెస్ట్" చేయాలని కొందరు నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు.
చట్ట ప్రకారం చర్యలు: సజ్జనార్ వార్నింగ్
రీల్స్ కోసం యువకుడు రోడ్డు మీద ప్రయత్నించగా, అంతలోనే సిటీ ఆర్టీసీ బస్సు అతడి పైనుంచి వెళ్లిన వీడియోపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్ అని స్పష్టం చేశారు. అది పూర్తిగా ఎడిట్ చేసిన వీడియో అని.. పాపులర్ అయ్యేందుకు కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో లైక్ లు, కామెంట్ల కోసం చేసే ఇలాంటి అనాలోచిత స్టంట్స్ ను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉందన్నారు. సరదా కోసం చేసే ఎడిటెడ్ వీడియోలు ఇతరుల ప్రాణాల మీదకు తెస్తాయన్నారు. TGSRTC యాజమాన్యం ఈ వీడియో ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు.