Finance Company Cheating: ప్రజల కష్టాన్ని అడ్డంగా దోచుకుని ఓ ఫైనాన్స్ సంస్థ బిచాణా సర్దేసింది. ప్రజల అవసరాన్ని అవకాశం మార్చుకుని, వారికి ఆశ చూపి, అందినకాడికి దోచుకెళ్లింది. అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపించి వినియోగదారులను నిర్వాహకులు నిలువునా ముంచేశారు. ఏకంగా 537 మంది నుంచి రూ.200 కోట్ల డిపాజిట్లు సేకరించి దుకాణం సర్దేసింది. దీంతో బాధితులంతా న్యాయం చేయాలంటూ హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెను సస్పెండ్‌ చేస్తూ యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 


అధిక వడ్డీ ఆశ చూపించి..
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేకా నేతాజీ (64), ఆయన కొడుకు శ్రీహర్ష (32) హైదరాబాద్‌ అబిడ్స్‌లో శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్, గ్రాఫిక్‌ సిస్టమ్, ఫైనాన్స్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణీబాల (60) టెస్కాబ్‌లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీరంతా త ఫైనాన్స్‌ కంపెనీలో డిపాజిట్లు చేస్తే అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపించి తమకు తెలిసిన వారు, చుట్టుపక్కల వారి నుంచి పెద్దఎత్తున డబ్బు సేకరించారు. తమ ఫైనాన్స్‌ కంపెనీలో డిపాజిట్లు చేస్తే 15-18 శాతం వడ్డీ ఇస్తారంటూ వాణీబాల తన సహోద్యోగులు, తమ బ్యాంకు ఖాతాదారులు, విశ్రాంత ఉద్యోగులను నమ్మించారు. ఇందులో భాగంగానే అందరికీ కొంత కాలం పాటు వడ్డీలు చెల్లించారు. అది నమ్మిన టెస్కాబ్‌ అధికారులు, వివిధ జిల్లాల డీసీసీబీల సిబ్బంది చాలా మంది ఈ కంపెనీలో రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు డిపాజిట్‌ చేశారు. కొన్నేళ్లలో మూడు రాష్ట్రాల్లో సుమారు 537 మంది ఈ కంపెనీలో రూ.200 కోట్లు డిపాజిట్‌ చేశారు.
 
వడ్డీ చెల్లింపుల్లో జాప్యం
గతేడాది నవంబరు, డిసెంబరు నుంచి ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు నేతాజీ, శ్రీహర్ష, వాణీబాల డిపాజిట్‌దారులకు వడ్డీల చెల్లింపులు జాప్యం చేయటం ప్రారంభించారు. దీంతో కొందరు డిపాజిట్ దారులు తమ డిపాజిట్లు తిరిగి చెల్లించాలని జనవరి, ఫిబ్రవరిలో ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో నిర్వాహకులు ఏప్రిల్‌ చివరి నాటికి పాతబకాయిలు చెల్లిస్తామని చెప్పి వెనక్కి పంపించేశారు. అదే అదునుగా నేతాజీ, శ్రీహర్ష, వాణీబాల అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చాలా సార్లు వారిని కలవడానికి యత్నించి వినియోగదారులు చివరకు మోసపోయామని బాధితులు గుర్తించారు. ఈ క్రమంలో వాణీబాల కుటుంబం కోర్టును ఆశ్రయించి ఐపీ దాఖలు చేశారు. దీంతో బాధితులు జ్యోతి దిట్టకవి, నిశిత, గౌతమ్, పి.మల్లికార్జునశర్మ, వెంకటేశ్వరాచారి, రాధాకృష్ణశర్మ, ఎం.శ్రీనివాసమూర్తి సోమవారం సీసీఎస్‌ ఎదుట ఆందోళన నిర్వహించి, ఫిర్యాదు చేశారు. 


ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి వ్యధ
ఇటీవల ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి కొంక రామారావు (81) రూ.6 లక్షలు డిపాజిట్‌ చేద్దామని టెస్కాబ్‌కు వెళ్లారు. అక్కడ వాణీబాల సూచనతో ప్రియాంక ఫైనాన్స్‌ కంపెనీలో డిపాజిట్‌ చేశారు. ఇటీవలే రామారావుకు గుండె శస్త్రచికిత్స జరిగింది. మందులకు కూడా డబ్బులు లేవంటూ ఆయన కుటుంబం వాపోయింది. వాణీబాల తమను నమ్మించి నిలువునా ముంచేసిందని శ్రీనివాసమూర్తి అనే డిపాజిటర్ ఆవేదన వ్యక్తం చేశారు. టెస్కాబ్‌లో పెన్షన్‌ లేదని, ఈ వడ్డీ ద్వారా జీవనం గడుస్తుందని వాణీబాల మాటలు నమ్మి తాము సంపాదించుకున్న మొత్తాన్ని ఫైనాన్స్‌ కంపెనీలో పెట్టి మోసపోయామని సంస్థలోని పలువురు విశ్రాంత అధికారులు వాపోయారు. బాధితుల్లో చాలా మంది తమ ఆర్థిక లావాదేవీల వ్యవహారం బయట పడుతుందనే భయంతో ఫైనాన్స్‌ కంపెనీపై ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.


విచారణకు ఆదేశం
వాణీబాల వ్యవహారం బయటకు రావడంతో టెస్కాబ్‌ యాజమాన్యం సోమవారం ఆమెను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. ఈ నెలలో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఆయా భత్యాల చెల్లింపు నిలిపివేయాలని టెస్కాబ్‌ ఎండీ మురళీధర్‌ ఆదేశించారు. ఆమె అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌ న్యూసైదాబాద్‌ కాలనీలోని ఆమె ఇంటికి సస్పెన్షన్, విచారణ ఉత్తర్వులను అంటించారు.