Telangana Realestate : తెలంగాణ ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఆ రంగంలో జరుగుతున్న లావాదేవీలు, అభివృద్ధి మాత్రం.. ఊహించనంతగా ఉంటున్నాయి. ఎనిమిదేళ్ల కిందట రిజిస్ట్రేషన్ల ఆదాయంతో పోలిస్తే.. ఇప్పుడు ఊహించనంతగా పెరిగింది. అప్పటి ఆదాయం ఇప్పుడు ఒక్క నెలలోనే వస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా లావాదేవీలు పెరిగాయి.
భారీగా పెరిగిన తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కొంత ముందు ప్రభుత్వానికి స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాబడి రూ.2,7000 కోట్లకు అటూ ఇటూగా వచ్చింది. ఈ ఏడాది ఇంకా నెలన్నర రోజుల సమయం ఉన్నప్పటికీ ఈ శాఖ ద్వారా రూ.12,624 కోట్ల రాబడి సమకూరింది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో రూ.5 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. అంటే మొత్తంగా ఈ రంగంలో రూ.17,600 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. రానున్న 40రోజుల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.1200 కోట్లు, వ్యవసాయ రిజిస్ట్రేషన్లతో రూ.800 కోట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది సరికొత్త రికార్డు నమోదు కానున్నదని అధికారవర్గాలుచెబుతున్నాయి.
ఏటికేడు పెరుగుతున్న రిజిస్ట్రేషన్ల ఆదాయం !
2015-16లో రూ.3,370 కోట్లు ఖజానా రిజిస్ట్రేషన్ల ఆదాయం రాగా , 2016-17లో రూ.3,560 కోట్లు, 2017-18లో రూ.4,571 కోట్లు, 2018-19లో రూ.6,612 కోట్లు, 2019-20లో రూ.7,061 కోట్లు, 2020-21లో రూ.5,260 కోట్లు, 2021-22లో రూ.12,365 కోట్ల ఆదాయం వచ్చింది. వ్యవసాయ రిజిస్ట్రేషన్లతో మరో రూ.5 వేల కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. ఈ ఏడాది వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రూపంలో 17.16లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ధరణి పోర్టల్‌కు 10.54 కోట్ల హిట్లతో ఇప్పటివరకు 30కోట్ల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2014-15లో భూ లావాదేవీలు 8.26లక్షల డాక్యుమెంట్లతో నమోదు కాగా, తాజాగా గతేడాది 19.88లక్షలకు చేరుకున్నాయి. ఆదాయం నాలుగు రెట్లుకు, డాక్యుమెంట్లు మూడింతలకు పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్ చుట్టే రియల్ వ్యాపారం జోరందుకుంటోంది. ఎక్కువ క్రయవిక్రయాల జాబితాలో మొదటి స్థానంలో రంగారెడ్డి, ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరీ, హైదరాబాద్ ఉన్నాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వైపే మధ్యతరగతి వర్గాల చూపు !
ప్రజలంతా తమ పెట్టుబడికి భూమికి మించిన మార్గం లేదనే అంచనాకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత స్థిరాస్తి రంగంలో స్తబ్దత ఏర్పడింది. 2019 తర్వాత ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు సాగాయి. రిజిస్ట్రేషన్ ఆదాయమే వేల కోట్లు వస్తూంటే..ఇక లావాదేవీలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో చెప్పాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు. లక్షల కోట్లలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. స్థూల ఆర్ధిక వృద్ధిలో అపూర్వ ప్రగతి దిశగా అడుగులు వేస్తోన్న తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు కీలక స్థానం ఉంది. ఏటేటా రూ.4 వేల కోట్లకుపైగా రాబడినిస్తున్న ఈ శాఖ ప్రజల్లో దాదాపు ఏడాదికి రూ.లక్ష కోట్ల టర్నోవర్‌ను చేతులు మార్చేలా చూస్తోంది.
తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక దన్ను !
ఓ వైపు రిజిస్ట్రేషన్ల ఆదాయం మాత్రమే కాదు.... ప్రభుత్వ భూముల విలువ పెరగడంతో పెద్ద ఎత్తున వాటిని అమ్మి ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటోంది. ఆర్థిక సమస్యలు తీర్చుకుంటోంది.