Red alert for Hyderabad due to Heavy Rains | హైదరాబాద్: క్యుములోనింబస్ ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురనుంది. ఇదివరకే శుక్రవారం ఉదయం నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కొన్ని ఏరియాలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్ లో ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు రెండు గంటలపాటు కుండపోత వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ, తెలంగాణ వెదర్ మ్యాన్ రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తం అయ్యాయి. అత్యవసరమైతే తప్పా, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలకు సూచించారు. వర్షపు నీటి వల్ల అమీర్ పేట నుంచి లక్డీకపూల్ వరకు, ఇటు పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు సాఫ్ట్ వేర్ ఏరియాలో ఐకియా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
శుక్రవారం ఉదయం జీహెచ్ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, అమీర్ పేట, పంజాగుట్ట, తిరుమలగిరి, అల్వాల్, సికింద్రాబాద్, ముషీరాబాద్, పారడైజ్, బేగంపేట, కూకట్‌పల్లి, బాచుపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మధ్యాహ్నం నుంచి కొన్ని ఏరియాలలో చినుకులు పడుతున్నాయి. సాయంత్రం నుంచి కొన్ని గంటలపాటు వాన దంచికొట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వర్షం తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ పేర్కొంది.
వనస్తలిపురం, ఎల్బీనగర్, మోతీనగర్, బోరబండ, మియాపూర్, కాప్రా, యాప్రాల్, నాగోల్, మాల్కాజిగిరి, కాచిగూడ, పటాన్ చెరు సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా చినుకులు పడుతున్నాయి. హైదరాబాద్ ఈస్ట్ ఏరియాలో అధిక వర్షపాతం నమోదు కానుంది. ఈ ప్రాంత వాసులు అత్యవసరమైతే తప్పా, ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం మంచిదని చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ సహా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు
ఉత్తర తెలంగాణలో వర్షం కుమ్మేస్తోంది. ఈరోజు రాత్రి రెండు గంటలపాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్, వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో 9 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురుస్తోంది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ లో గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోందని సమాచారం. సిద్దిపేటలో 9 సెం.మీ వర్షం కురిసింది.