Telangana Police Reaction On Singer Mangli Birthday Party Issue: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో గంజాయి, విదేశీ మద్యం వాడారంటూ ప్రచారం జరగ్గా.. తెలంగాణ పోలీసులు తాజాగా దీనిపై వివరణ ఇచ్చారు.
పోలీసులు ఏం చెప్పారంటే?
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం రాత్రి మంగ్లీ బర్త్ డే పార్టీ సందర్భంగా గంజాయి, డ్రగ్స్ వాడారంటూ వచ్చిన వార్తలు ఆందోళన కలిగించాయి. దీనిపై తాజాగా రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ స్పందించారు. 'మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పార్టీ మొదలైంది. త్రిపుర రిసార్ట్ నుంచి ఎక్కువగా శబ్దాలు వస్తున్నాయని మా ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. అక్కడ లిక్కర్ యూజ్ చేస్తున్నారని తెలిసి.. రాత్రి 12 గంటలకు మా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
అక్కడ 10 మంది మహిళలతో పాటు 12 మంది పురుషులు ఉన్నారు. పార్టీలో ఉన్న వారందరికీ డ్రగ్ టెస్టులు నిర్వహించగా.. జిల్లెలగూడకు చెందిన వ్యాపారి కొసనం దామోదర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ వచ్చింది. మిగిలిన వారిలో ఎవరికీ పాజిటివ్ రాలేదు. ఇతను కూడా మంగ్లీ ఇచ్చిన పార్టీలో గంజాయి తీసుకోలేదు. అంతుకు ముందే మరో చోట తీసుకున్నట్లు తెలిసింది. దాని గురించి విచారణ చేస్తున్నాం. పార్టీలో విదేశీ మద్యం, ఇతర మత్తు పదార్థాలు కూడా ఏమీ దొరకలేదు.' అని స్పష్టం చేశారు. మంగ్లీ ఇచ్చిన పార్టీలో మద్యం, డీజే వినియోగం కోసం అనుమతి తీసుకోలేదనే చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
మంగ్లీ వివరణ
తన బర్త్ డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం వాడారన్న ప్రచారంపై సింగర్ మంగ్లీ స్వయంగా వివరణ ఇచ్చారు. దీనిపై ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు తెలిసి ఏ తప్పూ చేయలేదని.. పార్టీలో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి డ్రగ్స్ వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల కోరిక మేరకు.. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో పార్టీ ప్లాన్ చేశామని.. చివరి నిమిషంలో అది రిసార్ట్‌కు మారిందని అన్నారు. అయితే, సౌండ్ సిస్టం, లోకల్ లిక్కర్‌కు పర్మిషన్ తీసుకోవాలని తనకు ఎవరూ చెప్పలేదని.. దానిపై తనకు అవగాహన కూడా లేదని చెప్పారు. అలా అనుమతి తీసుకోవాలని తెలిసుంటే తప్పకుండా తీసుకునేదాన్ని అని అన్నారు.
పార్టీలో గంజాయి పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూడా ఎక్కడో, ఎప్పుడో తీసుకున్నారని తెలిపారు మంగ్లీ. పార్టీలో ఎలాంటి మత్తు పదార్థాలు, విదేశీ మద్యం దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారని వివరించారు. తాము విచారణకు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. తనపై లేనిపోని అభియోగాలు మోపొద్దని.. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చెయ్యొద్దంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు మంగ్లీ. ఈ పార్టీలో విదేశీ లిక్కర్, గంజాయి వాడారంటూ ఆరోపణలు రాగా.. దానిపై తాజాగా తెలంగాణ పోలీసులు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.