తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటుతున్నా, పూర్తిస్థాయి మంత్రివర్గం ఇంకా కొలువు దీరలేదు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు, ముఖ్యమంత్రి పోస్టుతో సహా 18 మందికి క్యాబినెట్‌లో మంత్రులుగా అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది తొలి విడతగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే మరో ముగ్గురికి క్యాబినెట్‌లో చోటు దక్కడంతో, ప్రస్తుతం 15 మందితో తెలంగాణ సర్కార్ నడుస్తోంది. మరో మూడు క్యాబినెట్ బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. కొత్త మంత్రులు కీలక శాఖలు కేటాయించాలని అధిష్టానం వద్ద పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మరికొందరు సీనియర్ మంత్రులు తమ శాఖలు మార్చాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.  ఏడాదిన్నర దాటుతున్నా క్యాబినెట్ బెర్త్‌ల భర్తీ అనేది సీరియల్ స్టోరీలా సాగుతోందని రాజకీయ వర్గాల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత మంత్రులు, వారు నిర్వహిస్తోన్న శాఖలు

  1. . రేవంత్ రెడ్డి (ముఖ్యమంత్రి):ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద 11 కీలక శాఖలు ఉన్నాయి. వీటిలో హోం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్, క్రీడలు, విద్య, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వాణిజ్య పన్నులు, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, క్రీడలు, యువజన శాఖలు ఉన్నాయి.
  2. మల్లు భట్టి విక్రమార్క (ఉప ముఖ్యమంత్రి):ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ, విద్యుత్ శాఖ.
  3. డి. అనసూయ (సీతక్క):పంచాయతీరాజ్ శాఖ, మహిళ, శిశు సంక్షేమ శాఖ, రూరల్ డెవలప్‌మెంట్.
  4. కొండా సురేఖ:అటవీ శాఖ, పర్యావరణ శాఖ, దేవాదాయ శాఖలు.
  5. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి:నీటిపారుదల, CAD, ఆహార, పౌరసరఫరాల శాఖలు.
  6. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి:రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖలు.
  7. దామోదర రాజనర్సింహ:ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ & టెక్నాలజీ శాఖలు.
  8. దుద్దిళ్ళ శ్రీధర్ బాబు:ఐ.టి & అసెంబ్లీ వ్యవహారాల శాఖ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, వాణిజ్య-పరిశ్రమల శాఖలు.
  9. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి:రెవెన్యూ & హౌసింగ్ శాఖ, సమాచార శాఖలు.
  10. తుమ్మల నాగేశ్వరరావు:వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సహకార శాఖ, హ్యాండ్లూమ్స్ & టెక్స్‌టైల్ శాఖలు.
  11. జూపల్లి కృష్ణారావు:ఎక్సైజ్ శాఖ, టూరిజం & కల్చరల్ శాఖ, ఆర్కియాలజీ శాఖలు.
  12. పొన్నం ప్రభాకర్:రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖలు.

పట్టు పెంచుకునే వ్యూహంతో కీలక శాఖలన్నీ సీఎం వద్దే

సీఎంగా క్యాబినెట్‌పైనా, పార్టీలోనూ తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు, కీలక శాఖలు తన వద్దే పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సీఎం ప్రస్తుతం 11 శాఖలను నిర్వహిస్తున్నారు. ఇందులో హోం శాఖ, మున్సిపల్ శాఖ, విద్యా శాఖ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ఈ మూడు శాఖలు కూడా చాలా కీలకమైన, పెద్ద శాఖలు. సాధారణంగా వీటిని పార్టీలోని సీనియర్లకు అప్పగిస్తారు. కానీ, ఈ మూడు కీలక శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే అట్టిపెట్టుకున్నారు.

సాధారణంగా హోం శాఖను మరో మంత్రికి అప్పగించి, అందులో లా అండ్ ఆర్డర్ మాత్రం ముఖ్యమంత్రులు తమ వద్ద ఉంచుకోవడం ఆనవాయితీగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యక్తులకు హోం బాధ్యతలు అప్పగించి, లా అండ్ ఆర్డర్ మాత్రం సీఎం తన వద్దే ఉంచుకునేవారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నా, ఆ నిఘా సమాచారం సీఎంకే నేరుగా చేరుతుంది. డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్‌లు నేరుగా సీఎంకే బాధ్యత వహించే విధానం ఉంటుంది. అయితే, రేవంత్ రెడ్డి మాత్రం మొత్తం శాఖను తన వద్ద అట్టిపెట్టుకోవడం విశేషం.

ఇక, విద్య, వైద్యం రెండు కీలకమైన శాఖలు. అందులో దామోదర రాజనర్సింహకు వైద్యం కట్టబెట్టినా, విద్యాశాఖను మాత్రం ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. మున్సిపల్ శాఖ సైతం సీనియర్లకు అప్పగించే శాఖ. గత ప్రభుత్వంలో కేటీఆర్ ఈ బాధ్యతలను నిర్వర్తించారు. ఒకవేళ మున్సిపల్ శాఖను మరో మంత్రికి కేటాయించాల్సి వస్తే, ఆ శాఖను విభజించి అర్బన్ డెవలప్‌మెంట్ శాఖను తన వద్దే ఉంచుకోవచ్చన్న చర్చ సాగుతోంది. సీఎంగా తన స్థానం సుస్థిరం చేసుకోవడంతో పాటు, పాలనపైనా, పార్టీపైనా తన పట్టు కోల్పోకుండా ఉండే వ్యూహంతో ఈ శాఖలు తన వద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

కొత్తగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిలకు శాఖలను కేటాయించారు. గడ్డం వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీస్, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖలను, అడ్లూరి లక్ష్మణ్కు  ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖలను,  వాకిటి శ్రీహరికి పశు సంవర్థక,  డైరీ ,  మత్స్య శాఖలతో పాటు యువజన సర్వీసులు, క్రీడా శాఖలను కేటాయించారు. ఈ శాఖలన్నీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తోన్న శాఖలే.

 

కీలక శాఖల కోసం సీనియర్ల పట్టు, హోం శాఖపై భట్టి బెట్టు

గత మూడు రోజులుగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, శాఖల మార్పు వంటి అంశాలపై పార్టీ హై కమాండ్‌తో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే, తన వద్ద ఉన్న శాఖలే కొత్త మంత్రులకు కేటాయించనున్నట్లు, పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పు లేదన్న రీతిలో మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడటం గమనార్హం.

అయితే, సీనియర్ మంత్రులు శాఖల మార్పు విషయంలో తమ డిమాండ్లను ఇప్పటికే అధిష్టానం వద్ద పెట్టినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రస్తుతం ఆర్థిక, విద్యుత్ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే, తన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని హోం శాఖ ఇవ్వాలని కోరుతున్నారు. హోం శాఖ కీలకమైన శాఖ, పోలీసు యంత్రాంగానికి మంత్రే బాస్. రాష్ట్రంలో ఏ మూల చీమ చిటుక్కుమన్నా, రాజకీయ మార్పులు సంభవించినా ఆ నిఘా సమాచారం పోలీసు యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి చేరుతుంది. ఇలాంటి కీలక శాఖ కోసం భట్టి పట్టుబడుతున్నారు. ఢిల్లీ పర్యటనకు సీఎం తో పాటు సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లినా, మల్లు భట్టి విక్రమార్క వెళ్లకపోవడం పైన కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. మరో వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం హోం లేదా రెవెన్యూ శాఖలు ఇవ్వాలన్న కోరికను పార్టీ హైకమాండ్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.

సీనియర్ మంత్రుల ఆకాంక్షలు ఉండగా, కొత్త మంత్రులకు అవసరానికి తగ్గట్టు శాఖల కేటాయింపులు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు పార్టీ హై కమాండ్‌పైనా, సీఎం రేవంత్ రెడ్డిపైనా ఉంది. అయితే, వీటి మధ్య సమతుల్యం పాటిస్తూ మంత్రివర్గ కూర్పు ఉంటుందా, లేక పార్టీలో అగ్గి రాజేస్తుందా అన్నది వేచి చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రాధాన్యం కాపాడుకుంటూ సీనియర్ మంత్రుల ఆశలు ఎలా తీరుస్తారో అన్నది వేచి చూడాలి.

మరో వైపు ఇప్పటికే చాలా మంది పార్టీ సీనియర్లు మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడిన పరిస్థితులు ఉన్నాయి. నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డికి స్థానం దక్కుతుందని భావించారు. అయితే, ఈ దఫా విస్తరణలో చోటు దక్కకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి పదవి దక్కకపోతే ఎమ్మెల్యే పదవి మాత్రం ఎందుకు అన్నట్లు సుదర్శన్ రెడ్డి వర్గీయులు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది. మరో వైపు కోమటి రెడ్డి రాజగోపాల్ సైతం అసంతృప్తితో ఉన్నారు. హైదరాబాద్ - రంగారెడ్డి నుండి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న సీనియర్లు ఉన్నారు. అయితే, వీరందరిని పార్టీ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి ఎలా సంతృప్తి పరుస్తారో వేచి చూడాలి. మిగతా మూడు ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారు? ఎవరికి అమాత్యులుగా అదృష్టం వరిస్తుంది? మంత్రి పదవి దక్కని నేతల భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది? ఈ అసంతృప్తులను పార్టీ ఎలా సంతృప్తి పరుస్తుంది అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి.