ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ నినాదంతో పారిశ్రామికంగా గొప్ప విజయాలు సాధించామన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదక విడుదల చేసిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ సాధించిన విజయాలు వివరించారు.
టీఎస్ ఐపాస్ ద్వారా 2.32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని వివరించారు మంత్రి కేటీఆర్. ఇలా వచ్చిన పెట్టుబడులు పదహారున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయని వివరించారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. రాష్రం ఏర్పడిన తొలి రోజుల్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నామని... రానురాను వాటిన్నింటినీ అధిగమించి పోటీ రాష్ట్రాలను అధిగమించి వృద్ధి సాధించామని తెలిపారు.
టీఎస్ ఐపాస్ క్రియేట్ చేసి.. అనుకున్న టైంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని వివరించారు కేటీఆర్. అలా గడువు లోపు అనుమతులు రాకుంటే జరిమానా చెల్లించే రాష్ట్రం తమదని గుర్తు చేశారు. అందుకే ఎక్కడకు వెళ్లినా ఐపాస్ గురించే మాట్లాడుతున్నారన్నారు.
రాష్ట్రంగా ఏర్పడి కొద్ది కాలంలోనే మంచి ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్రం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు కేటీఆర్. రాజకీయ వ్యూహాలు ఎన్నికల టైంలోనే వేయాలని మిగతా టైంలో రాష్ట్ర, దేశాభివృద్ధికి పని చేయాలన్నారు. ప్రగతిశీల రాష్ట్రాన్ని అణగదొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని స్ఫూర్తిని మర్చిపోయి కేంద్రం ప్రవర్తిస్తోందన్నారు. చెడు చేస్తే కంద్రాన్ని విమర్శించడం.. మంచి చేస్తే పొగడటం చేస్తున్నామన్నారు.