KTR gives counter to PM Modi: 
హైదరాబాద్: ఎన్డీఏలో కలవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తమను కోరారని, అయితే అందుకు తాము ఒప్పుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించాయి. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి జూమ్లాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి... ప్రధానమంత్రి అబద్ధాల ప్రచారకర్త అన్నారు. ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు అని, కేసీఆర్ ఒక ఫైటర్, ఆయన నరేంద్ర మోదీ లాంటి చీటర్ తో కలిసి పని చేయరు అని స్పష్టం చేశారు.


ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ‘ప్రధానమంత్రి స్థాయిని తగ్గించేలా నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇంటింటికి నీళ్ళు ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం, 15 లక్షల రూపాయలు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం. భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు చేర్చుతానని మోదీ చెప్పినవన్నీ అబద్ధాలే. రాజకీయాల కోసం ఇంత నీచనికి దిగజారిన వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పీఎం, సీఎం మధ్య జరిగిన ఒక అధికారిక సమావేశాలను నీచమైన రాజకీయాలకు ప్రధానమంత్రి వాడుతున్నారు. ఇకనుంచి అధికారిక సమావేశాలకు సైతం కెమెరా పట్టుకుని వెళ్లాలేమో.


ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఆడడం దురదృష్టకరం. విద్యార్హతల విషయంలోనే అబద్దం చెప్పిన మోదీ మాటలను ఎవరు నమ్ముతారు. ఏ రాష్ట్రం వెళ్తే అక్కడ అబద్దాలు ఆడడం ప్రధానమంత్రికి అలవాటు అయింది. బెంగాల్ వెళ్తే మమతా బెనర్జీ పైన, ఒరిస్సా వెళ్తే నవీన్ పట్నాయక్ పై, మేఘాలయ వెళ్తే సంగ్మా పైన అబద్దాలు ప్రచారం చేస్తారు. కానీ తర్వాత వారితోనే పొత్తులు పెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కి కర్ణాటక నుంచి డబ్బులు ఇచ్చిందని మోదీ చెప్తున్నారు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి లేదు’ అంటూ కేటీఆర్ తనదైన శైలిలో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.


ఇవి కాదా వారసత్వ రాజకీయాలు.. 
‘ప్రధానమంత్రి తో ఉంటే మంచివాళ్లు అయిపోతారు. ప్రకాశ్ బాదల్- సుబ్బి సింగ్ బాదల్ వంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకోలేదా. కాశ్మీర్లలో ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కుమార్తెతో పొత్తు పెట్టుకోవచ్చు. చంద్రబాబు , లోకేష్ తో కలిసి పని చేయవచ్చు. ఎన్డీఏలో ఉండవచ్చు. కానీ బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ థాక్రేతో కలిసి బిజెపి పొత్తు పెట్టుకోవచ్చు. జనతాదళ్ సెక్యూలర్ దేవేగౌడ కుమారుడు కుమారస్వామితో పొత్తు పెట్టుకోవచ్చు. మీతో వారసత్వ రాజకీయాలు గుర్తుకు రావు లేదంటే గుర్తుకు వస్తాయి. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్న ప్రధానమంత్రి, మంత్రులు జ్యోతిరాదిత్య సిండియ ఎవరు, జై షా ఎవరో,  అనురాగ్ ఠాకూర్ ఎవరో చెప్పాలి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


బిజెపి ఒక వాట్సాప్ యూనివర్సిటీ అని, ప్రధానమంత్రి కథలు చెప్పడంలో ఆరితేరినారు, ఆయన సినిమా కథలు రాయడంలో ప్రయత్నించాలి అని కేటీఆర్ సెటైర్లు వేశారు. పలు పార్టీలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ఎన్డీయే లో చేరాల్సిన అవసరం ఎవరికీ లేదని, NDA మునిగిపోతున్న నావ అన్నారు. పిచ్చికుక్క కరిచిన వారైతెనే ఎన్డీఏలో చేరుతారంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ వచ్చి బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అంటారు, కాంగ్రెస్ పార్టీ తో కలిసి పనిచేస్తున్నమని ప్రధాని అంటారు. కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ కు డబ్బులు వస్తుంటే కేంద్ర ఐటి శాఖ, ఇతర శాఖలు నిద్రపోతున్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. 


మేము ఢిల్లీ, గుజరాత్ బానిసలం కాదన్నారు. రెండుసార్లు ఎన్నికల్లో గెలిచాం, ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా బిజెపిని తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. గత ఎన్నికల్లో 105 స్థానాల్లో బీజేపీ డిపాజిట్ గల్లంతయింది. ఈసారి అన్ని స్థానాల్లో తమ డిపాజిట్లు గల్లంతు కావని చెప్పగలరా అని ప్రశ్నించారు. శ్రీలంక ప్రధానితో 6000 కోట్ల అదాని కాంట్రాక్ట్ గురించి మాట్లాడిన మోదీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయకుండా ఎందుకు ఆగారో చెప్పాలన్నారు.