తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోం శాఖ మంత్రి చేసిన ప్రసంగంపై టీఆర్‌ఎస్‌ నేతలు ఒంటికాలిపై లేచారు. ఆయన అమిత్ షా కాదు అబద్ధాల షా, అబద్ధాలకు బాద్ షా, 
మిత్ షా అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. 


ఇది గుజరాత్ కాదు- పోరు తెలంగాణ


అలవోకగా అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు హరీష్‌. అమిత్ షా వచ్చి జూటా మాటలు చెప్పి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఇది గుజరాత్ కాదని... అమాయకులైన తెలంగాణ కాదని.. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ గడ్డ అని గుర్తు చేశారు హరీష్‌. ఇక్కడ అమిత్‌షా అబద్ధాలు నడవన్నారు.


మిషన్‌ భగీరథకు ఇచ్చిన నిధులెన్నీ?


అమిత్‌షాకు దమ్ము, దైర్యం ఉంటే తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్‌ రావు. ఆర్టికల్ 370 రద్దుకు టీఆరెఎస్ మద్దతు తెలిపిందని... తమ పార్టీ ఎంపీలు ఓటు కూడా వేశారని గుర్తు చేశారు. మిషన్ భగీరథకు కేంద్రం రూ. 2500 కోట్లు ఇచ్చింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రూపాయలు అయినా ఇచ్చారా అని అడిగారు. ఆధారం చూపాలన్నారు. సొంత ఖర్చులతో పథకం అమలు చేస్తున్నామన్నారు. మంచి ఫలితాలు ఇంచిందని కేంద్రం కూడా చెప్పిందన్నారు. 


ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదన్నది అబద్దమని తెలిపారు హరీష్‌. 18 మే 2021 నుంచి తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. పార్లమెంట్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి తుడు ఇదే సమాధానం చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 3.62 వేల మందికి చికిత్స చేయడం జరిగిందని... 850 కోట్లు ఖర్చు కాగా ఇందులో కేంద్రం 150 కోట్లు మాత్రమే ఇచ్చిందని విరమ్శించారు. కేంద్రం 26 లక్షల మందికి ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 87. 60 లక్షల మందికి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. 


డబుల్ డెక్కర్ ఉన్న యూపీ స్థానమేంటి?


సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయలేదన్నది పచ్చి అబద్దమన్నారు హరీష్‌. 3 సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులకు రూ. 2679 కోట్లతో శంకుస్థాపన చేశారన్నారు. నీతి అయోగ్ సూచీలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని.. డబుల్ డెక్కర్ ఉన్న యూపీ లాస్ట్ ప్లేస్‌ ఉందని ఎద్దేవా చేశారు. నిజాలపై చర్చకు సిద్దంగా ఉన్నారా అని హరీష్‌ పిలుపునిచ్చారు. 


మన ఊరు మన బడి పైసలు మాయే అన్నా విమర్శలకు కూడా హరీష్‌ కౌంటర్ ఇచ్చారు. రూ. 7300 ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు. సర్వ శిక్ష అభియాన్‌లో వచ్చేది 300 కోట్లని... రాష్ట్ర ప్రభుత్వం 7000 కోట్లు సమకుర్చుతోందని తెలిపారు. నరేగా పనులకు రూ. 30 వేల కోట్లు ఇచ్చామని కిషన్ రెడ్డి చెబితే... అమిత్ షా 18 వేల కోట్లు అంటున్నారని ఇద్దరిలో ఎవరు కరెక్టో తేల్చుకోమన్నారు. 


అమిత్‌షా అబద్దాల పురాణాలు


అమిత్ షా తెలంగాణలో ఓట్లు కావాలని అబద్ధాల పురాణాలు చదివారన్నారు హరీష్‌ రావు. రాజ్యాంగ బద్దంగా రాష్ట్రాలకు ఇచ్చే నిధులపై అబద్ధాలు చెప్పారన్నారు. రాష్ట్రాలకు హక్కుగా వచ్చే నిధులను కూడా వాళ్ల ఖాతాలో కలిపేసుకుంటున్నార్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు హరీష్‌. 


తాము అధికారంలోకి వచ్చాక నీళ్లు ఇచ్చామన్న హరీష్‌.. తెలంగాణలో యాడికి పోదామో... యాడికి పోయినా పండిన పంటను సాక్షిగా నీళ్లు ఇచ్చినట్టు చూపిస్తామన్నారు. దేశంలో అతి ఎక్కువ వరి పండించిన రాష్ట్రం తెలంగాణ అని మరోసారి స్పష్టం చేశారు. ఈ రాష్ట్రానికి హక్కుగా వచ్చే నిధుల గురించి ముందు మాట్లాడండని బీజేపీ లీడర్లకు సూచించారు. 7183 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. 


బీజీపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న సంగతి ఏమైందని నిలదీశారు హరీష్‌. 15. 62 లక్షల ఉద్యోగాలు నిపకుండా ఆపారన్నారు. రైల్వే లైన్లు అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి అధికారంలోకి రాకముందు నిరుద్యోగ రేటు 4.7 శాతం ఉంటే, ఇప్పుడు 7.11 శాతానికి పెరిగిందన్నారు. దేశంలో 15 లక్షల 62 వేలు 962 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆర్మీలో 2 లక్షలు, రైల్వైలో 3 లక్షలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41 వేల పోస్టులు ఇలా అనేక విభాగాల్లో సుమారు 25శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చారని తెలిపారు. ఈ లెక్కన ఇప్పటి వ‌ర‌కు 15 కోట్ల ఉద్యోగాలు రావాలని లెక్క చెప్పారు. ఎన్ని ఇచ్చారో వైట్ పేపర్ విడుదల చేయండని కేంద్రానికి డిమాండ్ చేశారు. 


బయ్యారం రైల్వే, ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివ్సిటీ ఏమైందని ప్రశ్నించారు హరీష్‌. కేంద్ర హోం మంత్రిగా విభజన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని.... ఎందుకు మాట్లాడరని నిలదీశారు. తెలంగాణలో ఫసల్ బీమా యోజన లేదు అంటున్న అమిత్‌షాకు గుజరాత్‌ సంగతి కనిపించదా అని క్వశ్చన్ చేశారు. గుజరాత్‌లోనే అమలు చేయడం లేదన్నారు. కార్పొట్‌కు కొమ్ముకాసే యోజన అని మీ గుజరాత్ అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు.