Telangana Weather Update:తెలంగాణలో వాతావరణం కూల్ కూల్ అయింది. ఇప్పటి వరకు ఉక్కపోత, వేడితో అల్లాడిపోయిన జనం ఒక్కసారిగీ ఉపశనం పొందారు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. శనివారం, ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.
మరో రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన గాలి వానలు ఉంటాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు కూడా పడొచ్చని అంచనా వేసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని ప్రకటించింది.
రెండు రోజుల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు సూచించారు. ఈదురుగాలతో కూడిన వర్షాలు పడుతున్నందున పంటలు జాగ్రత్త చేసుకోవాలన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు పడటంతో పంటలు నాశనమయ్యాయి. ఇప్పుడు మరో రెండు రోజులు వానలు అంటే రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఎత్తైన చెట్ల కింద ఉండొద్దని పిడుగు పడే ప్రమాదం ఉందని అంటున్నారు.
పలు ప్రాంతాల్లో గాలి వాన కారణంగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నిన్నమొన్నటితో పోలిస్తే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.
శనివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు:- మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
శనివారం ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు: - ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఆదివారం ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు:- కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన అత్యధిక ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.
21 మార్చి 2025 శుక్రవారం నాడు భద్రాచలంలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అయింది. అక్కడ 38.5 డిగ్రీలు నమోదు అయింది. గురువారంతో పోలిస్తే 0.7 డిగ్రీలు ఎక్కువ నమోదు అయింది. ఖమ్మంలో 37.6 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 37 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 36.8 డిగ్రీలు, మెదక్‌లో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రతు నమోదు అయ్యాయి.
హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉంటుంది?
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 36డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశలో గంటకు 08-12 కి.మీ వేగంతో వీస్తాయి. శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22.6డిగ్రీలు.