Mancherial District Latest News: తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగుతూ ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాసిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలం ముత్తాపూర్ గ్రామానికి చెందిన మంచర్ల శ్రీలత పదో తరగతి చదువుతోంది. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న టైంలో తండ్రి ఆరోగ్యం క్షీణించింది.
తండ్రి ఆరోగ్యం బాగాలేదని బాధ ఓవైపు, దగ్గర పడుతున్న పదోతరగతి పరీక్షలు మరోవైపు ఆమెను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఆ బాధలో ఉండగానే ఆమెకు మరో షాక్ తగిలింది. పరీక్ష టైంలోనే తండ్రి మల్లయ్య మృతి చెందాడు.
ఓవైపు తండ్రి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే మంచర్ల శ్రీలత మనోధైర్యాన్ని పెంచుకొని పదో తరగతి పరీక్ష రాసింది. మొదటి రోజు తెలుగు పరీక్షకు హాజరైంది. తండ్రి మరణం అందరినీ బాధ కలిగించేదే. కానీ పరీక్షకు ముందే ఇలా జరగడం ఆమెను జీవితాంతం కుంగదీసే అంశమే. అయిన ఆ బాధను గుండెలో దాచుకొని పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసింది మంచర్ల శ్రీలత. ఆమె మనోధైర్యాన్ని చూసి అధికారులు, కుటుంబ సభ్యులు జాలి చూపిస్తూనే అభినందిస్తున్నారు.