Telangana Iran MOU: తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, దిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కు చెందిన కల్చర్ హౌజ్, నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్స్ సెంటర్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రధానంగా ఉర్దూ, పర్షియన్ చారిత్రక మాన్యు స్క్రిప్ట్ లు, డాక్యుమెంట్ల మరమ్మతు, పరిరక్షణ డిజిటలైజేషన్ అలాగే కేటలాగ్ కోసం జరిగింది. ఈ మాన్యు స్క్రిప్ట్ లు ఇరాన్, భారత్ వారసత్వ సంపదగా వస్తున్నాయి. 


దక్షిణ భారత ప్రాంతాల డైరెక్టర్లు కూడా..


మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ కార్యక్రమం సెప్టెంబర్ 7వ తేదీన టి-హబ్ ఫేజ్ 2 భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబారి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, రాష్ట్ర ఆర్కైవ్స్ అండ్ రీసెర్చీ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ జరీనా పర్వీన్, నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మెహదీ ఖాజే పీరీ, నిరూమంద్, దక్షిణ భారత రాష్ట్రాల ప్రాంతీయ డైరెక్టర్లు పాల్గొన్నారు. 


భారత దేశంలోని ప్రముఖ ఆర్కైవ్స్ లలో ఒకటైన తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో ఈ ప్రాంతాన్ని పాలించిన బహమనీ, కుతుబ్ షాహీ, ఆదిల్ షాహీ, మొఘల్ రాజవంశాలకు చెందిన 1406ఏడీ నాటి అరుదైన చారిత్రక రికార్డుల సేకరణ ఉంది. ఇన్ స్టిట్యూట్ లో 43 మిలియన్లకు పైగా పత్రాలు ఉన్నాయి. వీటిలో 80 శాతం రికార్డులు హైదరాబాద్ దక్కన్ ప్రాంతంలోని పూర్వపు రాజవంశాల అధికారిక భాషలు కావడం వల్ల క్లాసికల్ పర్షియన్, ఉర్దూ భాషలలో ఉన్నాయి. 1956 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన జీవోలు, గెజిట్ లు మొదలైన వాటి అసలు కాపీలు కూడా రికార్డుల్లో ఉన్నాయి. 




 దిల్లీలోని రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం..


భారత దేశం, ఇరాన్ సంస్కృతులు, నాగరికతలను ప్రభావితం చేసిన భాగస్వామ్య చరిత్రను ఆస్వాదించాయి. తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ లో ఉన్న పత్రాలు రెండు దేశాలకు సంబంధించిన ముఖ్యమైన చారిత్రక కళాఖండాలు ఉన్నాయి. ఈ విలువైన ఉమ్మడి వారసత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని గమనించి ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు చేపట్టాయి. దిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయంలోని కల్చర్ హౌజ్ లో ఉన్న నూర్ ఇంటర్నేషనల్ మైక్రో ఫిల్మ్ సెంటర్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమం.. మిలియన్ల కొద్దీ ఉన్న చారిత్రక పత్రాలకు జీవం పోస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక సంపద భవిష్యత్ తరాలకు గొప్ప వారసత్వాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. భారత దేశం, తెలంగాణ మధ్య యుగ, ఆధునిక చరిత్రపై వారి పరిశోధన కోసం తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ తో క్రమం తప్పకుండా సహకరించే ఇతర దేశాల పండితులకు కూడా ఇది విలువైన ఆస్తి అవుతుంది. 


ఈ ఒప్పందం మాన్యూస్క్రిప్ట్స్ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఖర్చు లేకుండా చేయబడుతుందని అధికారులు తెలిపారు. ఇందుకోసం ఖర్చునంతా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రభుత్వం భరిస్తుందని రాష్ట్ర అధికారులు వెల్లడించారు.