తెలంగాణ(Telangana) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) సోమేశ్ కుమార్(Somesh Kumar) కేడర్ విషయంలో తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం తెలంగాణ కేడర్ లో ఉండగా ఆంధ్రప్రదేశ్ కేడర్ కి వెళ్లాలని ఆదేశించింది. గతంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించింది. కానీ, డిప్యుటేషన్ పై ఆయన తెలంగాణలో పని చేసేలా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) తర్వాత ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రకారమే ఇప్పుడు సోమేశ్ కుమార్ తెలంగాణలో అత్యున్నత అధికారిగా ఉన్నారు. అయితే, కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘమైన విచారణ చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం తాజాగా క్యాట్ ఉత్తర్వులు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇంకో ఏడాది సోమేశ్ కుమార్ కు పదవీ కాలం ఉంది. అయితే, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్(IAS) అధికారి సోమేష్ కుమార్ సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది. సోమేష్ కుమార్ సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని భావిస్తే ఆంధ్రప్రదేశ్ అనుమతితో డిప్యూటేషన్‌పై కొనసాగించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. సీఎస్ సోమేష్ కుమార్ కంటే సమర్ధులైన అధికారులు తెలంగాణలో లేరని ప్రభుత్వం భావిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంగీకారంతో డిప్యూటేషన్‌పై రప్పించుకోవాలని కేంద్రం సూచించింది. రాష్ట్ర విభజన సందర్భంగా తనను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించడంపై సోమేష్ కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ ట్రైబ్యునల్ ఆదేశాలను ఇప్పుడు హైకోర్టు కొట్టివేసింది. ఇక ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది.
సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అదే చెప్పిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్‌గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారాయన.
Also Read: చెత్తే సంపద-హైదరాబాద్ చుట్టూ ఎనర్జీ ప్లాంట్‌ల ఏర్పాటుకు వేగంగా అడుగులు