Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. తన దగ్గర ఎంతో నమ్మకంగా పని చేసే ఓ అనాథ డ్రైవర్ పేరిట అతడికి తెలియకుండా బ్యాంకులో 52 లక్షల లోన్ తీసుకున్నాడు. మరో 50 లక్షల రూపాయల బీమా కూడా తీసుకున్నాడు. ఆపై పోలీసులకు డబ్బు ఆశ చూపించి అతడిపై హత్యకు ప్లాన్ చేశారు. ఫుల్లుగా మద్యం తాగించి హాకీ స్టిక్ తో దాడి చేశారు. శవాన్ని రోడ్డుపై పెట్టి దానిపైనుంచి రెండు సార్లు కారును పోనిచ్చారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం జరిగిన ఆ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 


అసలేం జరిగిందంటే..?


వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడతాండాకు చెందిన బోడ శ్రీకాంత్ మోసాలకు పాల్పడుతూ జల్సా జీవితానికి అలవాటు పడ్డాడు. అయితే హైదరాబాద్ శివారు మోడిపల్లికి చెందిన 34 ఏళ్ల భిక్షపతి అతని వద్ద డ్రైవర్ గా పని చేసేవాడు. అనాథ అయిన అతని పేరుపై శ్రీకాంత్ ఓ సంస్థలో 50 లక్షల రూపాయలకు బీమా చేయించాడు. అతడి పేరిటే మరో 52 లక్షల రూపాయల లోన్ తీసుకొని ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశాడు. దానికి నామినీగా అతని పేరు పెట్టుకున్నాడు. అనంతరం భిక్షపతిని హత మార్చేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మోతీలాల్ తో పాటు తన దగ్గర పని చేసే సతీష్, సమ్మన్నలకు డబ్బు ఆశ చూపించాడు. డబ్బులు తీసుకున్న వాళ్లు.. భిక్షపతిని చంపేందుకు సాయం చేశారు.  


మోతీలాల్ వేసిన పథకం ప్రకారం.. 2021 డిసెంబర్ 22వ తేదీన భిక్షపతిని కారులో ఎక్కించుకొని బాగా మద్యం తాగించారు. అర్ధరాత్రి షాద్ నగర్ కు చేరుకొని.. అటు నుంచి మొగలిగిద్ద వైపు పయనం అయ్యారు. గ్రామ శివారులో అతనిపై హాకీ స్టిక్ తో దాడి చేసి హత్య చేశారు. శవాన్ని రోడ్డుపై ఉంచి రెండుసార్లు కారును పైనుంచి పోనిచ్చారు. ఇలా చేయడంతో భిక్షపతి మృతదేహం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అయితే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం అనంతరం హత్యగా ధ్రువీకరించారు. బీమా డబ్బుల కోసం నిందితులు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో పోలీసులకు క్లూ దొరికింది. 


బీమా సంస్థ నిర్వాహకులు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాల కోసం పోలీసులను సంప్రదించారు. బీమా డబ్బుకు ప్రయత్నిస్తున్న వ్యక్తికి భిక్షపతితో బంధుత్వం లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వారు రంగంలోకి దిగి పూర్తి ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఉద్యోగాల ఆశ పెట్టి కొందరు యువకుల నుంచి క్రెడిట్ కార్డులు తీసుకొని బ్యాంకుల్లో డబ్బులు కాజేయడంతో గతంలో నాచారం పోలీస్ స్టేషన్ లో శ్రీకాంత్ పై కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు.