ఈ నెల 29 (రేపు) బక్రీద్ పండుగ సందర్భంగా జంతు వధ అనేది ముస్లింలలో ఒక సాంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై నేడు (జూన్ 28) హైకోర్టులో విచారణ జరిగింది. యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ కుమార్ లేఖ రాశారు. మతపరమైన మనోభావాలు దెబ్బ తినేలా గోవధ జరుగుతోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. దీన్ని ధర్మాసనం పిల్‌గా స్వీకరించింది.
అయితే, జంతువధపై చర్యలు తీసుకోవాలని బక్రీద్ పండుగకు ఒక రోజు ముందు లేఖ రాయడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి సున్నితమైన అంశాల్లో చివరి నిమిషంలో వచ్చి హైకోర్టును అడిగితే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, గోవధ, అక్రమ రవాణా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని న్యాయస్థానానికి ఏజీ ప్రసాద్ తెలిపారు. చెక్ పోస్టులు పెట్టి కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. గోవధ నిషేధ చట్టం సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సీఎస్, డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. నిజమైన స్ఫూర్తితో బక్రీద్ జరుపుకోవాలని నిర్దేశించింది. ఆగస్టు 2న ఈ అంశంపై నివేదికలు సమర్పించాలని సీఎస్, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.