Telangana News: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచారని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకొని స్టేటస్ రిపోర్టు తెలియజేయాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే తామే సుమోటోగా నిర్ణయం తీసుకుంటామని కూడా తేల్చి చెప్పింది.
ముగ్గురిపైనే పిటిషన్
బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పార్టీ మారారని వాళ్లపై అనర్హత వేటు వేయాలని ఈ మేరకు స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందతోపాటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్‌లో దాఖలు చేసిన ఈ పటిషన్లపై ఆగస్టు ఏడో తేదీనే వాదనలు పూర్తి అయ్యాయి. అనంతరం తీర్పును రిజ్వర్ చేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. నెల రోజుల తర్వాత ఇవాళ(సోమవారం సెప్టెంబర్ 9న) తీర్పు వెల్లడించింది.
స్పీకర్ పట్టించుకోలేదని వాదన
ఒక పార్టీపై గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం సరికాదని వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్ నుంచి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఈవిషయంలో కాలయాపన జరుగుతుంటే కచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదించార. వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కోర్టు ముందు ఉంచారు. తాము మార్చిలోనే స్పీకర్‌కు ఈ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశామని వాదనల్లో తెలిపారు. దాదాపు ఐదు నెలలకుపైగా అయిపోయిందని వెల్లడించారు.
ఉదహరణగా మణిపూర్ కేసు
మణిపూర్ ఎమ్మెల్యేల కేసును కూడా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు. 142 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు స్పీకర్‌కు నోటీసులు జారీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక్కడ పార్టీ మారడమే కాకుండా మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేశారని దానం నాగేందర్ ఇష్యూను కోర్టుకు వివరించారు పిటిషనర్లు.
స్పీకర్‌ను ఆదేశించలేరన్న ప్రభుత్వం
స్పీకర్‌ను ఆదేశిస్తే రెండు వ్యవస్థల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం తరుఫున న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. దానం, కడియం తరఫున శ్రీరఘురాం, మయూర్‌రెడ్డ్డి, జంధ్యాల రవిశంకర్ కోర్టులో వాదించారు.
నాలుగు వారాల గడువు
పిటిషనర్ల తరఫున వాదను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పరిగణలోకి తీసుకుంది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఎప్పుడు నోటీసులు ఇస్తారు... ఎప్పుడు విచారణకు పిలుస్తారు. ఎప్పటి నుంచి వాదనలు వింటారు... ఎప్పటి లోపు ప్రొసీడింగ్స్ పూర్తి చేస్తారో వివరంగా షెడ్యూల్ తెలియజేయాలని ఆదేశించింది హైకర్టు. నాలుగు వారాల్లో షెడ్యూల్ రిలీజ్ చేయకపోయినా నిర్ణయం ప్రకటించకున్నా తామే ఓ నిర్ణయం చెబుతామని పేర్కొంది హైకోర్టు.
Also Read: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు - ఏమన్నారంటే!