టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింమది. ఒక్కొక్కరూ మూడు లక్షల రూపాయల పూచీకత్తు ఇవ్వాలని సూచించింది. ప్రతి సోమవారం కచ్చితంగా సిట్ విచారణకు రావాలని స్పష్టం చేసింది. పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని... దేశం విడిచి వెళ్లొద్దని తీర్పులో పేర్కొంది.


కేసు ఏంటి? ఏం జరిగింది?


టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం నెల రోజులుగా తెలంగాణలో సంచలం సృష్టిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 100 కోట్ల ఇస్తామని రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ ఆశ చూపారు. ముందు పైలెట్ రోహిత్ రెడ్డి కలిసిన ఈ నేతలు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఫామ్ హౌస్ వీడియోలు, ఆడియోలను టీఆర్ఎస్ బయటపెట్టింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 26వ తేదీన ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 41-ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ ఏసీబీ కోర్టు నిందితుల రిమాండ్ ను తిరస్కరించింది. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


ఎఫ్ఐఆర్‌లో ఇలా 


నిందితులు, ఎమ్మెల్యేల మధ్య జరిగిన బేరసారాలను ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పూసగుచ్చినట్టు వివరించారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, నందకిశోర్‌, సింహయాజీపై కేసు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్ ఏసీపీ తెలిపారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు.  బీజేపీలో చేరితో వంద కోట్లు... చేర్చిన వాళ్లకు యాభై కోట్ల పేరుతో ఆఫర్‌ నడిచించదని పోలీసులు చెబుతున్నారు. బీజేపీలో చేరితే వంద కోట్లు ఇప్పిస్తామని రోహిత్‌ రెడ్డికి రామచంద్ర భారతి ఆఫర్ చేసినట్టు పేర్కొన్నారు. దీనికి నంద కిశోర్‌ మధ్యవర్తిత్వం వహించారు. నంద కిశోర్ ఆహ్వానంతోనే  రామచంద్రభారతి, సింహయాజీ ఫామ్‌హస్‌కు వచ్చారు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన వారు ఎమ్మెల్యేలతో బేరాలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.  వచ్చిన మధ్యవర్తులు జరగబోయే పరిణామాలు వివరించారని పేర్కొన్నారు పోలీసులు. బీజేపీలో చేరకపోతే...కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పినట్టు కూడా అందులో తెలిపారు. బీజేపీలో చేరితే కీలక కాంట్రాక్ట్స్‌తోపాటు భారీ మొత్తంలో డబ్బు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామన్నట్టు వివరించారు. ఇదంతా రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.


విచారణలో మలుపులు


నిందితులు రామ చంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు డేటాను సేకరించారు. నిందితులతోపాటు అనుమానితులు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందినవారు కావడంతో పోలీసులు ఆయా ప్రాంతాల నుంచి డేటా సేకరించారు. హైదరాబాద్, ఫరీడాబాద్, తిరుపతి, దిల్లీ, బెంగళూరు, కొచ్చి, ఎర్నాకుళం తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. నిందితులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్న వారిని విచారణకు పిలుస్తున్నారు. సిట్‌ నోటీసులు అందుకున్న వారిలో అడ్వకేట్‌ శ్రీనివాస్, బీఎల్‌ సంతోష్‌,  జగ్గు స్వామి, తుషార్‌, నందకుమార్ భార్య చిత్రలేఖ, విజయ్ ఉన్నారు.  ఇందులో సంతోష్‌, జగ్గు స్వామి, తుషార్‌ మాత్రం విచారణకు హాజరుకాలేదు. వారిని రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇంతలో నిందితులకు కూడా బెయిల్ మంజూరైంది.