గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కొన్ని రోజుల క్రితం ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం కౌటంర్ దాకలు చేయకపోవడంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
రాజాసింగ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి నాలుగు వారాలు గడుస్తున్నా స్పందించకపోవడంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది హైకోర్టు. ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. మరో రెండు వారాలు సమయం కావాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 


రాజాసింగ్ కేసు విషయంలో ఇప్పటికే పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ బోర్డు విచారణ పూర్తైందని కోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. బోర్డ్ నిర్ణయం పెండింగ్‌లో ఉందని వివరించారు. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది వివరణ విన్న హైకోర్టు... ఈ నెల 20లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇకపై కౌంటర్ దాఖలు గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. కచ్చితంగా ఆ తేదీలోపు స్పందించాలని సూచించింది. 


తప్పు చేయలేదన్న రాజాసింగ్


మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని అధిష్ఠానానికి వివరణ ఇచ్చారు రాజాసింగ్. భారతీయ జనతా పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చారు. ఎప్పుడో సమాధానం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అరెస్ట్ కావడంతో ఆలస్యంగా  ఇచ్చారు. ఇప్పటికీ రాజాసింగ్ జైల్లోనే ఉన్నారు. ఇటీవలే ఆయన పీడీ యాక్ట్ అడ్వయిజరీ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో రాజాసింగ్ బీజేపీ హైకమాండ్‌కు తన వివరణ పంపించారు. జైలు నుంచే ఈ లేఖ పంపినట్లుగా అటెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని క్రమశిక్షణ కమిటీకి ఆయన లేఖ రాశారు. తానెక్కడ పార్టీ నిబంధనలను ఉల్లంఘించలేదని.. ఏ మతాన్ని కించపర్చలేదన్నారు. మునావర్ ఫారుఖీ షో సందర్భంగా తాను రిలీజ్ చేసిన వీడియోపై.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తప్పుడు కేసు పెట్టాయని.. ఆ కేసును కోర్టు డిస్మిస్ చేసిందన్నారు.


షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్న విధంగా తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని .. క్రమిశిక్షణా చర్యలు తీసుకోవాల్సినంత తప్పు తానేమీ చేయలేదన్నారు. తన వివరణను పరిశీలించాలని కోరారు. ఆగస్టు 25న రాజాసింగ్ ను పీడీయాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. చర్లపల్లి జైలులో రాజాసింగ్  ప్రస్తుతం ఉన్నారు.   రాజాసింగ్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియో వివాదాస్పదమైంది.ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యాలున్నాయని ఎంఐఎం నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.అదే  రోజు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.  అయితే ఈ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  పోలీసుల వినతి మేరకు ఈవీడియోను యూట్యూబ్ తొలగించింది. అయితే తర్వాత రాజాసింగ్‌పై వంద కేసులున్నాయని ఆయనపై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకుపంపారు.


Also Read: తప్పు చేయలేదు , పార్టీకే కట్టుబడి ఉంటా - బీజేపీ హైకమాండ్‌కు రాజాసింగ్ రిప్లై !


Also Read: ప్రభుత్వం చేతుల్లోనే రాజాసింగ్ విడుదల తేదీ..!?