Minister KTR Comments: టీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం ఉప్పొంగడం చూస్తుంటే మునుగోడులో బరాబర్ గెలుస్తామనే విశ్వాసం కలిగిందని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఉద్యమాల్లో రాటుదేలారని అన్నారు. అందులోనూ విద్యార్థి నాయకులు బాగా పని చేశారని కొనియాడారు. ఎన్నికల గురించి, పోరాటాల గురించి తాను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం టీఆర్ఎస్‌వీ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ప్రసంగించారు.
మునుగోడు ఎన్నికల గురించి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను కట్టబట్టిందని, అందుకే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలోకి వెళ్లారని అన్నారు. ఆయనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లుగానే తమ నల్గొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలా చేస్తే పోటీ నుంచి తప్పుకుంటామని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ విషయంలో మంత్రి జగదీశ్ రెడ్డి ఇవే వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కట్టుబడి ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు.
‘‘మునుగోడు ఉప ఎన్నిక కేవలం ఒక్క కారణంతోనే వచ్చింది. ఒక కాంట్రాక్టర్ బలుపు వల్లనే వచ్చింది. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి, ఆయనను కొనేసి, అవసరమైతే రూ.500 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అయ్యారు. మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొంటానని నరేంద్ర మోదీ అహకారం ప్రదర్శించారు. ఆ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికే మునుగోడు ఉప ఎన్నిక అని కేటీఆర్ స్పష్టం చేశారు.
చంద్రబాబు, వైఎస్ఆరే నయం - కేటీఆర్
చంద్రబాబు, వైఎస్ఆరే నయం అని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు బఫూన్ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ బఫూన్ గాళ్లు ఎక్కడ ఉన్నారని.. ఊరు, పేరు అడ్రస్ లేని లవంగం గాళ్లు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇలాంటి పిచ్చోళ్లతో మనం పోరాడాల్సి వస్తోందని అనుకోలేదని అన్నారు. ఈడీ, బోడీలతో తమ వెంట్రుక కూడా పీకలేరని స్పష్టం చేశారు. దమ్ముంటే తమ ఆరోపణలకు మోదీ సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘‘నిన్న మునుగోడు నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి ధనవంతుడైతే ఆ నియోజకవర్గం బాగుపడదు. రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్ట్‌లు ఇవ్వడం కాదు. నల్గొండ జిల్లా అభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటాం. మా మంత్రి ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను కట్టుబడి ఉన్నా. మాకు మా నియోజకవర్గ అభివృద్ధి కావాలి.’’ అని కేటీఆర్ అన్నారు.