మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం రాజకీయా పార్టీలు ఒకరిపై మరొకరు నేరుగా దుమ్మెత్తి పోసుకోవడం మొదలుపెట్టాయి. ఇప్పటిదాకా ఆరోపణలు, ప్రత్యారోపణల రూపంలోనే ఉన్న పోటీ ఇప్పుడు పోస్టర్లు అంటించే వరకూ వెళ్లింది. మంగళవారం ఉదయం మునుగోడులోని చండూరు టౌన్ లో పోస్టర్ల కలకలం రేగింది. బీజేపీ అభ్యర్థి, మునుగోడు ఉప ఎన్నిక వచ్చేందుకు కారణం అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థులు రాత్రికి రాత్రే పోస్టర్లు అంటించారు.


రాజగోపాల్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ.. ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే.. అంటూ ఆరోపించారు. ఏకంగా 18 వేల కోట్లు లావాదేవీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించారని ఆ పోస్టర్లలో ఉంది. దాదాపు వేల సంఖ్య ఇలాంటి పోస్టర్లను రోడ్ల పక్కన గోడలకు, దుకాణాలకు ఎక్కడపడితే అక్కడ అంటించారు.


Contract Pe (కాంట్రాక్ట్ పే) అనే హెడ్డింగ్ తో ‘‘రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించడం జరిగింది. ట్రాన్సాక్షన్ ఐడీ BJP18THOUSANDCRORES. న్యూ రివార్డ్ ఎర్న్‌డ్ 500 కోట్లు బోనస్’’ అని పోస్టర్లపై ముద్రించారు.


ఇప్పటివరకు రాజగోపాల్ రెడ్డి ఆస్తులకు సంబంధించి ప్రత్యర్థులు అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆయనపై ఏకంగా పోస్టర్లు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది.


అయితే, దీనిపై బీజేపీ మద్దతుదారులు స్పందిస్తూ.. టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ కు చెందిన నేతలే ఈ పోస్టర్లను ఏర్పాటు చేసి ఉంటారని అంటున్నారు. ఉప ఎన్నిక పోరులో రాజగోపాల్ రెడ్డి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో పోస్టర్లు ఏర్పాటు చేయడం ఇది తొలిసారి కాదు. ఆయన రాజీనామా చేసిన దగ్గర నుంచి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతూనే ఉన్నాయి. కానీ, ఇది ఇందులో మాత్రం మరో అడుగు ముందుకేసి ఆరోపణలు చేశారు.


కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తననే మళ్లీ గెలిపిస్తారని, ఆయన ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా కొన్ని రోజుల కిందట ప్రకటించింది.


టీఆర్ఎస్ పార్టీ (బీఆర్ఎస్) అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నిలిపింది. ఉద్యమకారుడిగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపాలని స్థానిక నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారని.. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టలను పరిశీలించిన తరువాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అందులోనూ గులాబీ పార్టీ బీఆర్ఎస్ గా జాతీయ పార్టీగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.


మునుగోడు బైపోల్ ముఖ్యమైన తేదీలివే
ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ - అక్టోబరు 7, 2022
నామినేషన్లకు ఆఖరి తేదీ - అక్టోబరు 14, 2022
నామినేషన్ల పరిశీలన - అక్టోబరు 15, 2022
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - అక్టోబరు 17, 2022
పోలింగ్ తేదీ - నవంబరు 3, 2022
కౌంటింగ్ తేదీ - నవంబరు 6, 2022