Rajiv Swagruha: బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీకి సంబంధించి హెచ్ఎండీఏ మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న దరఖాస్తుదారులు ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ క్రమంలోనే టోకెన్ అడ్వాన్స్ చెల్లించిన వారందరి పేర్లతో మరోసారి లాటరీ తీయనున్నారు. రెండు చోట్ల దాదాపు 3700 ఫ్లాట్లు ఉండగా.. ఇందులో 40 శాతం ఫ్లాట్లు మాత్రమే ఇటీవలి లాటరీ ద్వారా విక్రయించారు. లాటరీలో దక్కించుకున్న వారు కూడా పూర్తి డబ్బులు చెల్లించకపోవడంతో ఇలా మిగిలిన ఫ్లాట్లకు మరోసారి లాటరీ వేస్తున్నట్లు సోమవారం హెచ్ఎండీఏ ఓ ప్రకటనలో తెలిపింది. 


దీని వల్ల పోచారం, బండ్లగూడల్లో సింగిల్ బెడ్ రూం ఫ్లాట్లు 13 నుంచి 18 లక్షలకే వచ్చే వీలుంది. అలాగే బండ్లగూడలో 3 బీహెచ్ కే డీలక్స్ ఫ్లాట్లు 50 నుంచి 60 లక్షల్లో పొందే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం www.swagruha.telangana.gov.in వెబ్‌సైట్‌ తో పాటు 799355776, 7993455791 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని తెలిపింది. 


మూడు నెలల క్రితమే విక్రయాలు ప్రారంభం.. 


పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు రాగా, బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇక పోచారంలో 1,328 ఫ్లాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యాయి. మరో 142 ఫ్లాట్లలో స్వల్పంగా పనులు మిగిలి ఉన్నాయి. పూర్తయిన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.2,500గా, సెమీ ఫినిష్‌డ్ చదరపు అడుగుకు రూ.2,250గా నిర్ణయించారు. లాటరీలో ఎంపికైన వారికి బ్యాంకు లోన్ సౌకర్యం కూడా ఇస్తారు. అత్యధికంగా బండ్లగూడలోని 345 త్రిబుల్ బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు. బండ్లగూడలో 419 ఫ్లాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యాయి. మరో 1,082 ఫ్లాట్లలో పనులు కొనసాగుతున్నాయి. ఈ బండ్లగూడ ప్లాట్లకు చదరపు అడుగుకు రూ.3 వేలు, సగం పనులు పూర్తయిన ప్లాట్లకు చదరపు అడుగుకు రూ.2,750గా హెచ్ఎండీఏ నిర్ణయించింది.


ఇక 3 BHK డీలక్స్ ఫ్లాట్లలో ఒక హాల్, 3 బెడ్రూమ్స్, 3 అటాచ్డ్ బాత్ రూమ్స్, కిచెన్, స్టోర్ రూమ్, పూజ రూమ్, బాల్కనీ సౌకర్యాలు ఉంటాయి. 3 BHK ఫ్లాట్లలో ఒక హాల్, 3 బెడ్ రూం, 2 అటాచ్డ్ బాత్ రూమ్, కిచెన్, పూజ రూమ్, బాల్కనీ ఉంటాయి. 2 BHK ఫ్లాట్లలో హాల్, కిచెన్, 2 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, బాల్కనీ, 1 BHK ఫ్లాట్లలో హాల్, కిచెన్, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, బాల్కనీ ఉన్నాయి.