Rajasingh : పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ .. భారతీయ జనతా పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చారు. ఎప్పుడో సమాధానం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అరెస్ట్ కావడంతో ఆలస్యంగా ఇచ్చారు. ఇప్పటికీ రాజాసింగ్ జైల్లోనే ఉన్నారు. ఇటీవలే ఆయన పీడీ యాక్ట్ అడ్వయిజరీ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో రాజాసింగ్ బీజేపీ హైకమాండ్‌కు తన వివరణ పంపించారు. జైలు నుంచే ఈ లేఖ పంపినట్లుగా అటెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని క్రమశిక్షణ కమిటీకి ఆయన లేఖ రాశారు. తానెక్కడ పార్టీ నిబంధనలను ఉల్లంఘించలేదని.. ఏ మతాన్ని కించపర్చలేదన్నారు. మునావర్ ఫారుఖీ షో సందర్భంగా తాను రిలీజ్ చేసిన వీడియోపై.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తప్పుడు కేసు పెట్టాయని.. ఆ కేసును కోర్టు డిస్మిస్ చేసిందన్నారు.
మునావర్ ఫారుఖీని ఇమిటేట్ మాత్రమే చేశానని.. ఏ మతాన్ని, వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నానని ఆ లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు. ఎంఐఎం విధానాలను ప్రశ్నిస్తే ముస్లింలను తిడుతున్నట్లుగా వక్రీకరిస్తున్నారని.. తనపై వందకు పైగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. మునావర్ ఫారుఖీ షో రోజు తనతో పాటు 5 వందల మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని తెలిపారు. తానెక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని.. పార్టీలో కొనసాగుతూ బీజేపీకి, దేశానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ డిసిప్లినరీ కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలన్న విధంగానే తాను పోరాడుతున్నానని తెలిపారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తనపైన వంద కేసులు పెట్టారన్నారు.
షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్న విధంగా తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని .. క్రమిశిక్షణా చర్యలు తీసుకోవాల్సినంత తప్పు తానేమీ చేయలేదన్నారు. తన వివరణను పరిశీలించాలని కోరారు. ఆగస్టు 25న రాజాసింగ్ ను పీడీయాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. చర్లపల్లి జైలులో రాజాసింగ్ ప్రస్తుతం ఉన్నారు. రాజాసింగ్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియో వివాదాస్పదమైంది.ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యాలున్నాయని ఎంఐఎం నేతలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.అదే రోజు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అయితే ఈ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల వినతి మేరకు ఈవీడియోను యూట్యూబ్ తొలగించింది. అయితే తర్వాత రాజాసింగ్‌పై వంద కేసులున్నాయని ఆయనపై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకుపంపారు.
యూట్యూబ్ లో రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వీడియోలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందున రాజాసింగ్ ను బీజేపీ నుండి సస్పెండ్ చేశారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని రాజాసింగ్ ను బీజేపీ ఆదేశించింది. అయితే పీడీ యాక్ట్ తో జైలులో ఉన్నందున వివరణకు మరింత సమయం ఇవ్వాలని రాజాసింగ్ భార్య ఉషాబాయ్ కోరారు. బీజేపీ నాయకత్వానికి సమాధానం పంపారు రాజాసింగ్. రాజాసింగ్ సమాధానంపై బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.