Stock Market Closing Bell 10 October 2022: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ (సోమవారం) 1 శాతం పైగా నష్టాల్లో ప్రారంభమైనా, కనిష్ట స్థాయుల నుంచి పుంజుకున్నాయి. మధ్యాహ్నం వరకు బండిని బాగానే లాగి, గత ముగింపు స్థాయి వరకు వెళ్లాయి. యూరోపియన్ మార్కెట్లు నెగెటివ్‌గా ప్రారంభం కావడంతో ఇండియన్ సూచీలు మళ్లీ పాత పాటే పాడాయి. ఎలా పెరిగాయో, అలాగే దిగొచ్చాయి. చివరి గంటలో షార్ట్స్ కవరింగ్‌ల వల్ల మళ్లీ కోలుకున్నాయి. మొత్తంగా చూస్తే, ఈ రోజంతా సూచీల నడక పడుతూ, లేస్తూ సాగింది.
BSE Sensex
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇవాళ (సోమవారం) 767 పాయింట్లు లేదా 1.32 శాతం నష్టంతో 57,424.07 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. రోజు ముగిసేసరికి 200.18 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 57,991.11 వద్ద ముగిసింది.
NSE Nifty
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇవాళ 220 పాయింట్లు లేదా 1.27 శాతం నష్టంతో 17,094.35 పాయింట్ల వద్ద ఓపెనైంది. చివరకు, 73.70 పాయింట్లు లేదా 0.43 నష్టంతో 17,241 వద్ద ముగిసింది.
Nifty Bank
బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 536 పాయింట్లు లేదా 1.37 శాతం నష్టంతో 38,641.55 పాయింట్ల వద్ద మొదలైంది. క్లోజింగ్ బెల్ సమయానికి 84.95 పాయింట్లు లేదా 0.22 నష్టంతో 39,093.10 వద్ద ముగిసింది.
Top Gainers and Lossers
మార్కెట్ ప్రారంభ సమయంలో నిఫ్టీ 50లో కేవలం 2 కంపెనీలు (పవర్ గ్రిడ్, కోల్ ఇండియా) మాత్రమే లాభాల్లో ఉండగా, మిగిలిన 48 కంపెనీలు నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. మార్కెట్ ముగిసేసరికి 15 కంపెనీలు లాభాల్లోకి వచ్చాయి. 34 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ప్రారంభంలో గ్రీన్‌గా కనిపించిన కోల్ ఇండియా, రోజు ముగిసేసరికి ఎలాంటి మార్పు లేకుండా న్యూట్రల్‌గా నిలిచింది. యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, విప్రో, ఐషర్ మోటార్స్ 1-3 శాతం వరకు లాభపడ్డాయి. టాటా మోటార్స్, టాటా కన్జూమర్, హీరో మోటార్స్ 2-4 శాతం వరకు నష్టపోయాయి. మిగిలినవి కౌంటర్లన్నీ 2 శాతం వరకు నష్టాలను భరించాయి. నిఫ్టీ ఐటీ తప్ప మిగిలిన 14 సెక్టోరియల్ ఇండీస్ నష్టాల్లోనే ట్రేడయ్యాయి.
టీసీఎస్ Q2 రిజల్ట్స్‌తో ఇవాళ్టి నుంచి రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభమైంది. బజాజ్ ఆటో, శ్రీ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫలితాలూ ఈ వారమే విడుదలవుతాయి. వీటితో పాటు, జీవిత కాల కనిష్ట స్థాయిలో ట్రేడవుతున్న రూపాయి కదలికలూ కీలకమే. సెప్టెంబరులో అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా నమోదైనందున, నవంబరులో అక్కడ వడ్డీ రేట్లు పెంచొచ్చని భావిస్తున్నారు. బుధవారం వెలువడే మన దేశ రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలు, గురువారం రాత్రి వచ్చే అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపైనా మార్కెట్ దృష్టి పెడుతుంది. కాబట్టి, కార్పొరేట్ ఫలితాలు, కీలక ఆర్థిక గణాంకాల ఆధారంగా ఈ వారం మార్కెట్ కదలాడొచ్చని విశ్లేషకుల అంచనా.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.