Advocate Rachana Reddy To Join In BJP: తెలంగాణ హైకోర్టులో ప్రముఖ న్యాయవాది అయిన రచనా రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. అందుకోసం మంగళవారం ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ ను కలిశారు. బీజేపీలోకి రావాల్సిందిగా బండి సంజయ్ రచనా రెడ్డిని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఆ భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరే అంశంపై తాను బండి సంజయ్‌తో చర్చలు జరిపానని, త్వరలోనే బీజేపీలో చేరతానని చెప్పారు. అయితే, తేదీ లాంటి వివరాలను చెప్పలేదు. త్వరలోనే చేరికకు సంబంధించి అన్ని వివరాలు చెప్తానని రచనా రెడ్డి తెలిపారు.


తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా రచనా రెడ్డికి మంచి పేరు ఉంది. గతంలో ప్రొఫెసర్ కోదండరామ్ ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఉపాధ్యక్షురాలి పదవి అప్పగించారు. అయితే కొద్దిరోజులకే పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఉపాధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి 2018 డిసెంబరులోనే బయటికి వచ్చేశారు. అప్పటి నుంచి రచనా రెడ్డి ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. తాజాగా బీజేపీ వైపు మొగ్గు చూపడం ఆసక్తి కలిగిస్తోంది. 


Also Read: హైదరాబాద్ పేరుని బలవంతంగా మార్చారా? అంతకు ముందు భాగ్యనగర్‌గానే పిలుచుకున్నారా?


రచనా రెడ్డి న్యాయవాదిగా తనదైన శైలిని ఏర్పర్చుకున్నారు. సామాజిక సమస్యలపై కూడా ఆమె ప్రశ్నిస్తుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు రైతుల తరపున హైకోర్టులో కేసులు వేసి వాదించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రచనా రెడ్డి వేసిన కేసులను అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓ సందర్భంలో ప్రస్తావించారు.


కొదండరామ్ పై విమర్శలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు కలిపి ప్రజా కూటమి పేరుతో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలోనే కోదండరామ్ తో రచనా రెడ్డికి విభేదాలు తలెత్తాయి. ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కోదండరాం ఏకపక్ష ధోరణితో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. పార్టీలో సామాజిక న్యాయం కొరవడిందని, అది ప్రస్తుత ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కాదని వాదించారు. వంకాయలు, బీరకాయల్లా టికెట్లను కూటమి పార్టీలు అమ్ముకున్నాయని, దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లుగా ప్రజా కూటమి తయారైందని రచనా రెడ్డి అన్నారు. తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీని నడిపిన నమ్మకంతో కోదండరాంను నమ్ముకుని చాలా మంది ఆయన పార్టీ టీజేఎస్ లో చేరారని, వారందరినీ ఆయన నట్టేట్లో ముంచారని ఆరోపించారు.


Also Read: KTR Satire: ‘అచ్చేదిన్ ఆగయా, ప్రతి ఫ్యామిలీకి మోదీ గిఫ్ట్ ఇదీ’ - ప్రధానిపై కేటీఆర్ సెటైర్లు