Telangana CM KCR Review Meeting: అల్పపీడనం బలహీనపడటంతో తెలంగాణలో గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరుసగా మూడోరోజు రాష్ట్రంలో వరదలు, సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. గత వారం కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాంతో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై శనివారం సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు.  వరుసగా మూడోరోజు మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, అధికారులు సహాయక చర్యలలో పాల్గొంటున్నారు.


అంటు వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 56 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ఇంకా చేపట్టాల్సిన చర్యలపై కేసీఆర్ వారికి ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలలో పాల్గొనాలని మంత్రులు, ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ ఆదేశాలిచ్చారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి పరిస్థితి, అప్రమత్తతపై ఇంజినీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని, ముంపును తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఔట్ ఫ్లో పెరిగినట్లయితే, దిగువకు నీటిని అధికమొత్తంలో విడుల చేస్తే  లోతట్టు ప్రాంతాల ప్రజలను సాధ్యమైనంత ముందుగా అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.


ఎగువ గోదావరి ప్రాంతంలో వరద ఉధృతి కొనసాగుతుండటంతో భద్రాచంలో పరిస్థితిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. భద్రాచలం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిస్థితిని కేసీఆర్ కు వివరించారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 12వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.


ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనావేస్తూ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి సత్యవతి రాథోడ్ ను సీఎం కేసీఆర్ ఫోన్లో ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు, ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లాలోని పస్రా నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్లే గుండ్ల వాగు రోడ్డు పునరుద్ధరణ పనులను ఆదివారం నాడు ఆమె పరిశీలించారు.


KTR Review Meeting: పది రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ ప్రజలకు ఊపిరి పీల్చుకున్నారు. వరద తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావంతో గ్రామాల్లో దెబ్బతిన్న వాటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, తక్షణమే తాత్కాలికంగా ఉపశమనం కలిగేలా చర్యలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం తరుఫున ఎలాంటి సహకారమైనా తక్షణమే అందిస్తామని హామీ ఇచ్చారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.  రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయని.. సహాయక చర్యలు, సమస్యలు లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలని, కార్యక్రమాలపైన పురపాలక శాఖ అధికారులకు మంత్రి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial