Revanth Reddy Fires On CM KCR: సీఎం చంద్రశేఖర్‌రావుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం మరోసారి ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్‌కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు రక్షించడంలో లేదన్నారు. శనివారం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గానికి వందలమంది కార్యకర్తలతో రేవంత్‌రెడ్డి పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలోనే ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్ పనులను ఆయన పరిశీలించారు. సోమవారం లోపు ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలన్నారు. లేకపోతే పార్లమెంటులో సోమవారం నితిన్ గడ్కరీకి నివేదిస్తామని చెప్పారు. అక్కడినుంచి మల్కాజ్‌గిరికి చేరుకున్న రేవంత్‌రెడ్డి.. అక్కడి కాలనీల్లో పర్యటించారు.


ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల రక్షణపై లేదా?
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల ప్రాణాలపై లేదని దుయ్యబట్టారు. వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదని, ఫలితంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. వరదలతో అల్లాడుతున్న ప్రజలను పట్టించుకోకుండా, వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా సీఎం కేసీఆర్‌ రాజకీయాలపై దృష్టిపెట్టారని మండిపడ్డారు. సీఎంకు ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదని ధ్వజమెత్తారు.


ప్రజల ప్రాణాలు పూచిక పుల్లలతో సమానమా?
కేసీఆర్‌, కేటీఆర్‌కు ప్రజల ప్రాణాలంటే పూచిక పుల్లతో సమానమని రేవంత్ రెడ్డి విమర్శించారు. వరద బాధితుల ఆర్తనాదాలు వారికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతున్న తండ్రీకొడుకులు రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. వాతావరణ శాఖ తుఫాన్ ముందస్తు హెచ్చరికలు చెబుతూ ఉన్నా పట్టించుకోలేదని, ఫలితంగా తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వరదలు తగ్గుముఖం పట్టినా తండ్రీ కొడుకులు సమీక్షలు చేయకుండా రాజకీయాలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే మంత్రి కేటీఆర్ పార్టీల్లో మునిగిపోయారని విమర్శించారు. 


సీఎం ఎందుకు వెళ్లలేదు
వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. వాతావరణ శాఖ సూచనలను పట్టించుకుని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. వర్షాలు, వరదల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలను పరామర్శించడానికి సీఎం ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. వరదలతో అతాలాకుతలమైన రాష్ట్రానికి కేంద్రం తాత్కాలిక వరద సాయం కింద రాష్ట్రానికి రూ.1,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డిపై ఉందన్నారు.  వరదల్లో నష్టపోయిన వారికి.. ప్రభుత్వం తాత్కాలిక పరిహారంగా రూ.15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని అన్నారు. ఇసుక మేటలతో నిండిన వ్యవసాయ భూములకు తయారు చేయించుకోవడానికి రూ.20,000 ఇవ్వాలన్నారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందనన్నారు. 


కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపు
వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ప్లడ్ రిలీఫ్ కమిటీ వేశామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మండల, జిల్లా స్థాయి నాయకులను అప్రమత్తం చేశామని పేర్కొంది. బాధితులకు ఆహార ఏర్పాట్లు చేస్తున్నామని వివరించింది. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఇందుకోసం నెంబర్లు 040-24602383, 040 - 24601254 లకు ఫోన్‌చేయాలని వెల్లడించింది. 







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial