భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గాంధీ చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులను థియేటర్ల వద్దకు తీసుకువచ్చి, తిరిగి వారిని తమ గమ్యస్థానాలకు చేర్చేలా ఉచిత రవాణా సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించనుంది. 


తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర మండలి అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. థియేటర్లలో విద్యార్థుల కోసం సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశించారు. 


మహాత్మా గాంధీ జీవనశైలి, మానవతా విలువలు నేటి తరానికి తెలియజేయాలని గత ఏడాది ఆగస్టులో స్వతంత్ర వజ్రోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రంలోని థియేటర్లలో తొలిసారిగా ప్రదర్శించిన గాంధీ చిత్రానికి విశేష స్పందన లభించింది. ముగింపు వేడుకల్లోనూ విద్యార్థులకు మరోసారి జాతీయ స్ఫూర్తిని చిత్ర ప్రదర్శన చేపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.


‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలలో భాగంగా విద్యార్థులలో జాతీయ స్పూర్తిని చాటే విధంగా రాష్ట్రంలోని 582 స్క్రీన్ లలో ఈ నెల 14 నుండి 24 వ తేదీ వరకు ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ఛాంబర్ లో చిత్ర ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది’’ అని మంత్రి తలసాని తెలిపారు.


ఈ సమావేశంలో FDC చైర్మన్ అనిల్ కుమార్ కూర్మాచలం, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, FDC MD అశోక్ రెడ్డి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి మన్నన్, FDC ED కిషోర్ బాబు, UFO, క్యూబ్, సెరసెర, PVR ప్రతినిధులు శ్రీనివాస్, సాయిరఘురామ్, ప్రదీప్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.