Hyderabad Pollution News : హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. దీని నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలకాంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్‌లో డీజిల వాహనాలు పూర్తిగా నిషేధిస్తామన్నారు. ఆర్టీసీలో ఉన్న వాటిని కూడా తిరగనివ్వబోమని స్పష్టం చేశారు. 


ఈ మధ్య కాలంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ పరిమితి 300 దాటింది అంటే హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో పెరిగిపోయిన వ్యక్తిగత వాహనాలు, ఇతర కారణాలతో కాలుష్‌య తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. 


పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారక ముందే చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే ఢిల్లీ లాంటి పరిస్థితి చవిచూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలోనే కాలుష్యాన్ని నియంత్రించలేకపోతే నగర ప్రజలంతా ఇబ్బంది పడతారని కూడా హెచ్చరిస్తున్నారు. 
పెరుగుతున్న కాలుష్యం, గాలి నాణ్యత తగ్గిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్ ఇండెక్స్‌లో గాలి నాణ్యత దారుణంగా ఉన్న దేశంలోని నగరాల్లో హైదరాబాద్ ఏడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ ఉంది. హైదరాబాద్‌ కంటే చెన్నై, బెంగళూరు కూడ మెరుగ్గానే ఉన్నాయి. ఇలాంటివే నగరంలో పెట్టుబడులు ఇతర అంశాలపై ప్రభావం చూపిస్తారని గ్రహించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. 


ఇప్పటికే కాలుణ్య నియంత్రణకు కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకున్న వాళ్లకు రాయితీలు ఇస్తోంది. ఇప్పుడు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంది ప్రభుత్వం. ఓవైపు వరదలు, మరోవైపు కాలుష్య నియంత్రణ చర్యలకు సిద్ధమైంది. అందుకే హైదరాబాద్‌లో డీజిల్ వాహనాలు పూర్తిగా నిషేధించాలని ఆలోన వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం వెల్లడించారు. 


హైదరాబాద్‌ ఎన్టీఆర్‌మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ మైదానంలో రవాణాశాఖ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. కాలుష్య కారణంగా ఢిల్లీని విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితి ఉందని అలాంటి దుస్థితి హైదరాబాద్‌కు రానీయొద్దని రేవంత్ అభిప్రాయపడ్డారు. కొన్ని సిటీలలో వర్షాలు పడితే పడవల్లో ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. అలాంటివి హైదరాబాద్‌లో చూకడకూడదన్నారు. ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు లేకున్నా.. ఇప్పుడు కాలుష్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే హైదరాబాద్‌ను అందరం కలిసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. 


హైదరాబాద్‌ను కాలుష్య కోరల నుంచి విధివిధానాలను రూపొందిస్తామన్నారు రేవంత్. కాపాడుకునేందుకు డీజిల్ ఆటోలు, బస్‌లను బంద్‌ పెడదామన్నారు. ఆటో కార్మికులు నష్టపోకుండా ఉండేందుకు విద్యుత్తు ఆటోలు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక పథకం తీసుకొస్తామన్నారు. దీని కోసం ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. 


హైదరాబాద్‌లో డీజిల్ ఆర్టీసీ బస్‌లను కూడా నియంత్రిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం మూడు వేలకుపైగా ఆర్టీసీ బస్‌లు ఉంటే అందులో 90 శాతం డీజిల్‌తో నడిచివే అన్నారు. వాటిని కూడా ఓఆర్‌ఆర్‌ అవతలకు పంపిస్తామని కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశ పెడతామన్నారు. అంతే కాకుండా ఆర్టీసీలో పదిహేనేళ్లు దాటిన బస్‌లను కూడా స్క్రాప్‌ చేస్తామన్నారు. 


కాలుష్యాన్ని నియంత్రించేందుకు దేశంలోనే ఉత్తమమైన ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉచితం అనుకుంటున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని గుర్తుచేశారు.