Yadadri Temple Board | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేసింది. యాదగిరిగుట్ట ఆలయాలని బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో తిరుమల ఆలయానికి టీటీడీ బోర్డు ఉన్నట్లుగా, తెలంగాణలో యాదాద్రికి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
యాదగిరిగుట్ట ఆలయం అభివృద్ధి పనులపై టూరిజంపై నిర్వహించిన సమీక్షలో అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. రాష్ట్రంలో హెల్త్ టూరిజంను సైతం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ లో జూపార్క్ బయట మరో జూపార్క్ ఏర్పాటు చేయాలని అధికారుకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. స్పీడ్‌పై (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్షించారు. హెల్త్,ఎకో టూరిజం ప్రాజెక్టులు, టెంపుల్ సర్క్యూట్‌ల అభివృద్ధిపై అధికారులతో రేవంత్ చర్చించారు. ఈ సమీక్షకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీలను రూపొందించాలని నిర్ణయం. రాష్ట్రంలో ఉన్న చారిత్రక స్థలాలు, ప్రాచీన ఆలయాలు, అటవీ ప్రాంతాలు, వైద్య సదుపాయాలను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాలు ఉండేలా కొత్త టూరిజం ప్యాకేజీలుండాలన్నారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటుపై చర్చించారు. పర్యాటకానికి అనువైన ప్రాంతాలన్నీ గుర్తించి, టూరిజం, దేవాదాయ, అటవీ శాఖ అధికారులు కలిసికట్టుగా పనిచేసి డెవలప్ చేయాలని చెప్పారు.
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డ్
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD Board) తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు (Yadadri Temple Board) ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా చట్ట సవరణ చేయాలన్నారు. యాదాద్రి ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని చెప్పారు. ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు అర్థంతరంగా ఉన్నాయని, ఇప్పటివరకు ఏమేం అభివృద్ధి పనులు జరిగాయి.. ఇంకా ఏమేం అసంపూర్తిగా ఉన్నాయనే వివరాలతో వారం రోజుల్లో నివేదికను అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. భక్తులు విడిది చేసేందుకు కాటేజీలు నిర్మాణాలకు దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు.
మరోవైపు హైడ్రా కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి సైతం అధికారులు నోటీసులు పంపించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి అంతా సమానమేనని, ఏ పార్టీని లక్ష్యంగా చేసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు పలుమార్లు చెప్పారు. గతంలో జీహెచ్ఎంసీ అధికారులు, ఇతర అధికారులు చెరువులు, ఇతర జలశయాలు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలపై ఇచ్చిన నోటీసులపై తాము తదుపరి చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదివరకే స్పష్టం చేశారు.