Woman Allegations On LB Nagar Police Beats Her at PS:
హైదరాబాద్‌: ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగిన నాడే మనకు అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ చెప్పిన మాట తరచుగా ఏదో చోట వినిపిస్తుంది. కానీ తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు అర్ధరాత్రి సమయంలో ఓ మహిళపై ఇద్దరు పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. మహిళ అని కూడా చూడకుండా ఆగస్టు 15న రాత్రి 11 గంటల తర్వాత ఎల్బీనగర్‌ పోలీసు స్టేషన్‌ కు తరలించారు. ఆపై లాఠీలతో దారుణంగా కొట్టి ఆమెను హింసించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళిసై... మహిళపై జరిగిన దారుణ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ లను ఆదేశించారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలన్నారు. బాధిత మహిళకు అండగా ఉండాలని రెడ్‌క్రాస్‌ సొసైటీకి గవర్నర్ సూచించారు.
అసలేం జరిగిందంటే..
ఆగస్టు 15 రాత్రి 11 గంటలకు ఎల్బీనగర్‌ చౌరస్తాలో పోలీసులకు ముగ్గురు మహిళలు కనిపించారు. స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ వారిని పీఎస్ కు తరలించారు. సెక్షన్‌ 290 కింద కేసు నమోదు చేశారు. తమను ఎందుకు తీసుకొచ్చారని మీర్‌పేటకు చెందిన మహిళ ప్రశ్నించగా.. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు శివశంకర్‌, సుమలత ఆ మహిళను లాఠీలతో దారుణంగా కొట్టారు. రాత్రంతా స్టేషన్ లో ఉంచి లాఠీలతో కొట్టారని బాధితురాలు ఆరోపిస్తోంది. అలాగే తన శరీరంపై లాఠీతో కొట్టినట్లుగా ఉన్న గాయాలను కూడా చూపిస్తోంది. ఆగస్టు 15వ తేదీ రాత్రి సమయంలో తాను ఇంటికి వెళ్తుండగా.. పోలీసులు వచ్చి వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని.. సెల్ ఫోన్ లాక్కొని చిత్ర హింసలకు గురి చేశారని ఆరోపించింది. బుధవారం ఉదయం తనను ఇంటికి పంపించినట్లు చెప్పింది. అయితే ఆమె చేస్తున్న ఆరోపణలు అన్నీ నిజం కాదని.. ఎల్బీ నగర్ ఇన్ స్పెక్టర్ తెలిపారు. మీర్‌ పేట నంది హిల్స్ లో బాధితురాలు నివాసం ఉంటుండగా... ఆమెతో పాటు ఆమె బంధువులు అందరూ పోలీస్టేషన్ లో ఆందోళనకు దిగారు. 


ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద ముగ్గురు మహిళలు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని సమాచారం వచ్చిందని ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ తెలిపారు. 16వ తేదీ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చామని.. ఐపీసీ - 209 సెక్షన్ కింది కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. 


ఇద్దరు పోలీసుల సస్పెండ్
ఈ కేసులో రాచకొండ సీపీ చౌహాన్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులపై వేటు వేశామని చెప్పారు. మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ సీపీ చౌహాన్ ఆదేశించారు. మహిళపై దాడి ఘటనపై విచారణ చేసి నివేదిక తెప్పించుకున్న సీపీ.. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.